సోమవారం జరిగిన తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సురవరం చిత్రానికి మంత్రులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సురవరం కుటుంబ సభ్యులకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి అంటే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రిక. దీని గురించి అందరూ ప్రస్తావన తెస్తారు.
ఈ గోల్కొండ కాకుండా ఆయనలోని మిగతా కోణాలు, పార్శ్వాలు తెలుసుకున్నాను. సురవరం సంకలనాల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. సురవరం అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి.. ఆయన జీవితం సంఘర్షణమయం. 125 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి గుర్తు చేసుకుంటూ ఉంటే.. ఎంత కాలం జీవించామన్నది కాదు.. ఎలా జీవించామన్నది ముఖ్యం అని కేటీఆర్ చెప్పారు.ఒక సంఘసంస్కర్తగా, సంపాదకుడిగా, పాత్రికేయుడిగా, కవిగా, రచయితగా, సాహితీవేత్తగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించకపోతే ఎంతో మంది మహానుభావుల గురించి భవిష్యత్ తరాలకు తెలిసి ఉండకపోయేదేమో అని అన్నారు.
ఈ రోజు హెల్త్ యూనివర్సిటీకి కాలోజీ నారాయణరావు పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు, హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టుకున్నాం. ప్రతాపరెడ్డి పేరును కూడా ఏదో ఒక యూనివర్సిటీకి పెడుతామని చెప్పారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ సాంస్కృతికి పునరుజ్జీవనం ఇమిడి ఉందని సీఎం కేసీఆర్ చెబుతుంటారు. తెలంగాణ కవులు, రచయితల గురించి ఇంకా శోధించాల్సిన అవసరం ఉందన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే సమయంలో యాధృచ్చింగా ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలు రావడం సంతోషంగా ఉందన్నారు. సురవరం ప్రతాపరెడ్డికి సముచితమైన గౌరవం ఇచ్చేలా కృషి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.