నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీఆర్‌ఎస్ , కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్దినే కేసీఆర్ సర్కార్ తాము చేసామని అబద్ధపు ప్రచారం చేసుకుంటుందని, కావాలని చర్చకు సిద్ధం కావాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సవాల్ విసిరారు. జానా సవాల్‌కు మంత్రి జగదీష్ రెడ్డి సై అన్నారు. 60 ఏళ్లలో ఫ్లోరిన్ మహమ్మారితో జిల్లా ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం అల్లాడిపోతున్నా కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదని, కేసీఆర్ సర్కార్ ఆరున్నరేళ్లలో జిల్లాలో ఫ్లోరిన్ భూతాన్ని తరిమికొట్టి ప్రజలకు సురక్షిత నీరు అందించామని చెప్పారు.
అంతే కాదు గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాను సస్యశ్యామలం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. కావాలంటే జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, అది సాగర్ అయినా, నల్గొండ అయినా, కోదాడలో అయినా ఎక్కడైనా సరే రెడీ..అంటూ జానారెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి ప్రతిసవాల్ విసిరారు. అయితే జగదీష్ రెడ్డి సవాల్‌కు జానారెడ్డి స్పందించకుండా సైలెంట్ అయిపోయారు. వారం రోజులైనా కాంగ్రెస్ నేత జానారెడ్డి స్పందికపోవడంతో మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ అభివృద్ధి చేయలేదని జానారెడ్డి అన్నారని.. అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరితే ఆయన తోక ముడిచారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పీడ వదిలింది కాబట్టే తెలంగాణ అభివృద్ధి చెందిందని మంత్రి జగదీష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో వరుసగా రాళ్లదాడులతో అలజడి రేపుతున్న బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రచారం కోసం అరాచకాలకు పాల్పడే చరిత్ర బీజేపీది విరుచుకుపడ్డారు. అవినీతి, అరాచకాలకు పుట్టినిల్లు కాంగ్రెస్, బీజేపీలు అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయని మంత్రి జగదీష్‌రెడ్డి కాషాయనేతలను హెచ్చరించారు. మొత్తంగా జానారెడ్డి తన సవాల్‌కు స్పందించకపోవడంతో మంత్రి జగదీష్ రెడ్డి అటు జానారెడ్డికి, ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నారు.