రాములు నాయక్‌‌కు ఎమ్మెల్సీ టికెట్‌…కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ..!

262
ramulu naik
- Advertisement -

రాములో..రాముల..నన్ను ఆగం చేసిండ్రో..రాములో రాముల..నన్ను ఆగం చేసిండ్రో..ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు ఈ పాట పాడుకుంటూ ఆగఆగమవుతున్నరంట…తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో రచ్చ మొదలైంది. తాజాగా తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. మార్చి 14 న పోలింగ్ జరగనుండగా, మార్చి 17 న ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ రావడానికి ముందే కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా రాములు నాయక్, పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం నుంచి అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.

అయితే పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో చిన్నారెడ్డి అభ్యర్థిత్వంపై పెద్దగా విమర్శలు లేకున్నా..మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌ నేతలు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన రాములు నాయక్ వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి ఎలా పోటీ చేస్తారని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. రాముల్ నాయక్ అభ్యర్థిత్వంపై పార్టీ అగ్ర నేతల్లో చర్చ కూడా జరిగిందంట..అయినా కాంగ్రెస్ అధిష్టానం నేతల అసంతృప్తి రాగాన్ని పరిగణనలోకి తీసుకోలేదంట..రాములు నాయక్ గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో గులాబీ బాస్ కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం రాముల్‌నాయక్‌ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన రాములు నాయక్‌కు అధిష్టానం ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. అయితే రాముల్ నాయక్‌కు టికెట్ ఇవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన బెలయ్య నాయక్..భగ్గుమంటున్నారు..గత కొన్నాళ‌్లుగా బెలయ్యనాయక్ కాంగ్రెస్‌ పార్టీ తరపున అగ్రెస్సివ్‌గా రాజకీయాలు చేస్తున్నారు.

కేసీఆర్ సర్కార్‌పై పదునైన విమర్శలు చేస్తూ..తన సామాజికవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని ఆయన ఎంతో ఆశపెట్టుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం టీఆర్ఎస్‌నుంచి వచ్చిన రాముల్‌నాయక్‌కు టికెట్ ఇవ్వడంతో బెల్లయ్య నాయక్ పార్టీ ఇంచార్జ్‌లపై గుర్రుగా ఉన్నారంట. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై బెల్లయ్య నాయక్ మండిపడుతున్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, భట్టివిక్రమార్క వంటి యోధానుయోధులైన కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వీరిలో ఎవరితోను రాములు నాయక్ ఇంకా టచ్‌లోకి వెళ్లలేదని పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. కనీసం సీనియర్ నేతలతో సమన్వయం చేసుకోకపోతే రాముల్‌ నాయక్‌కు ఎలా మద్దతు ఇస్తారని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్‌‌కు బలమైన నాయకులు ఉన్న జిల్లాలలో మెదక్ జిల్లాకు చెందిన నాయకుడికి టికెట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటని.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు బెల్లయ్య నాయక్ మాత్రమే కాకుండా ఎమ్మెల్సీ టికెట్‌పై చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారంట..అందుకే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ పట్టభద్రుల ఓట్లు నమోదు చేయించారంట..వారెవ్వరితో పార్టీ పెద్దలు మాట్లాడకుండా ఏకపక్షంగా స్థానికేతరుడైన రాములు నాయక్‌కు ఏకపక్షంగా టికెట్ కేటాయించారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు టికెట్ రాకపోయినా బెల్లయ్య నాయక్ వెనక్కి తగ్గడం లేదంట..ఇండిపెండెంట‌్‌గా అయినా పోటీ చేసి కాంగ్రెస్ అధిష్టానానికి తన సత్తా చాటాలని భావిస్తున్నారంట..అదే జరిగితే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాములు నాయక్‌ వైపు మొగ్గు చూపుతారా లేదా బెలయ్య నాయక్ వైపు మొగ్గు చూపుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వ్యూహం ఇంత వరకు రచించలేదంట..రాములు నాయక్ మాత్రం ఈ నియోజకవర్గంలోని మూడు జిల్లాలలో అత్యధిక సంఖ్యలో ఉన్న తన సామాజికవర్గం ఓట్లపైనే ఆశలు పెట్టుకున్నారంట..ఒకవేళ బెల్లయ్య నాయక్ ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీ బరిలో ఉంటే మాత్రం..ఓట్లు చీలి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గట్టెక్కుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ పెద్దలు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానంలో గెలుపు కోసం ఏకమై బెల్లయ్య నాయక్ వంటి నేతలను బుజ్జగిస్తారా..లేదా షరామామూలుగా చేతులెత్తేసారా అన్నది చూడాలి.

- Advertisement -