చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా బాసిల్లిన నందికొండ (నాగార్జునసాగర్)ను సుందరికరిస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.అరువది ఏండ్లుగా ఇక్కడ లోకల్ బాడీ లేకపోవడంతో నందికొండ ఈ దుస్థితికి చేరిందన్నారు.అటువంటి ప్రాంతాన్ని మొట్టమొదటి సారిగా గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన చెప్పారు. ఆదివారం నందికొండ పురపాలక సంఘం అభివృద్ధిపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకు ముందు మంత్రి జగదీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ శర్మ, ఆర్ డి ఓ మిర్యాలగూడెం రాహుల్ స్థానిక మున్సిపల్ చైర్మన్ కర్ణ అనుషా శరత్ రెడ్డి,కమిషనర్ చల్లారావులతో కలసి పురపాలక సంఘం పరిధిలోని వివిధ వార్డులలో పర్యటించి పరిస్థితులను స్వయంగా సమీక్షించారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు వెలిబుచ్చిన పలు సందేహాలను మంత్రి శాఖాల వారిగా సమీక్షించి నివృత్తి చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు ప్రతి రూపమే నందికొండ పురపాలక సంఘంగా రూపాంతరం చెందిందని కొనియాడారు. అంతకు ముందు పక్కన 200 టియంసిల నీరు ఉన్నా ప్రతిరోజు మంచినీటి ఎద్దడిని ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు.అటువంటి ప్రాంతంలో మంచినీటి ఎద్దడి నివారణకు శాశ్వతంగా పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. ఇప్పటికే నీటిపారుదల శాఖా అధీనంలో ఉన్న త్రాగునీటి సరఫరాను మరో రెండు రోజుల్లోనే పురపాలక శాఖకు బదాలయించేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు.విద్యుత్ ఉత్పత్తి ఉన్న నందికొండలో ప్రజలు చీకట్లోనే మగ్గారని తాజాగా పురపాలక సంఘంగా రూపాంతరం చెందిన నందికొండలో విద్యుద్దీకరణ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయన్నారు.
ప్రపంచ పర్యాటక కేంద్రంగా బాసిల్లిన నందికొండ సుందరీ కరణకు రూట్ మ్యాప్ సిద్ధమైందని పాలనా పరమైన అనుమతులు రాగానే పనులు మొదలు పెడ్తమన్నారు. కూరగాయల మార్కెట్‌తో పాటు మాంసం మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి నిర్మించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.అంతే గాకుండా మార్నింగ్ వాకర్స్ సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ లను వెంటనే నిర్మించాలని ఆయన సూచించారు. అటు హిల్ కాలనీ ఇటు పైలాన్ కాలనీలలో వైకుంఠదామాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వీదీలైట్ల ఏర్పాటులో నిర్లక్ష్యం కూడదన్నారు. పర్యాటక కేంద్రంగా ఉన్నందున ఇక్కడికి వచ్చిపోయే యాత్రికులకు ఏ అసౌకర్యం కలిగినా ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరుతాయన్న విషయాన్ని విస్మరించరాదని మంత్రి అన్నారు.