మోదీ ప్రభుత్వం ఒక్కో రంగాన్ని ప్రైవేటు పరం చేస్తోంది..

301
minister allola
- Advertisement -

ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, సమ్మె చేస్తున్న బ్యాంకు ఉద్యోగులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న సమ్మెకు మద్దతు తెలపాలని బ్యాంకు ఉద్యోగులు శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరగా.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి తన సంఘీభావాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆర్థిక వ్యవస్థను పీడిస్తోన్న అన్ని సమస్యలకూ ప్రైవేటీకరణ పరిష్కారమని కేంద్ర ప్రభుత్వం భావించడం సరైంది కాదన్నారు. మోదీ ప్రభుత్వం నెమ్మదిగా ఒక్కో రంగాన్ని ప్రైవేటు పరం చేస్తూ వస్తోందని, బ్యాంకింగ్ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని ఈ నిర్ణయాన్ని తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రైతులు రోజుల తరబడి పోరాటం చేస్తున్నారు.

ఇప్పుడు అదే లక్ష్యంతో బ్యాంకింగ్ రంగం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారని మంత్రి పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తమ మద్దతు ప్రకటించారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగుల సంఘం నాయకులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, గండ్రత్ ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -