తెరాస హయాంలోనే రైతులకు స్వర్ణ యుగం..

275
- Advertisement -

తెరాస ప్రభుత్వం లోనే రైతులకు స్వర్ణ యుగం ప్రారంభమైందని మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. రైతు బంధు, రైతు బీమా పథకాలతో తమ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టేలా చేశాయన్నారు. ఇవాళ ఆయన హరిత ప్లాజాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గిడ్డంగుల నిర్మాణం, గిడ్డంగుల సామర్థ్యంలో దేశంలో తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్ అని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పారు. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్, సంస్థ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. గిడ్డంగుల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ ఉదారంగా నిధులు ఇస్తే…సంస్థ ఉద్యోగులు కష్టించి పని చేస్తున్నారని కొనియాడారు.

2014 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో పది లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములుంటే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గోదాముల సామర్థ్యాన్ని 21 లక్షలకు పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 80 శాతం ఆక్యుపెన్సీ శాతం ఉంటే….తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వం ద శాతం ఆక్యుపెన్సీతో దేశంలో తెలంగాణ రాష్ట్రం తొలి స్థానంలో నిలిపామన్నారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్ని గోదాములు నిర్మించారో…. అంతకన్నా ఎక్కువ గోదాములు తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్లలో నిర్మించామని చెప్పారు.

Minister Harish Rao

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసి అవి నిండిన తర్వాతే ప్రభుత్వ గోదాములు నింపేవారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ గోదాముల్లో నిండిన తర్వాతే ధాన్యాన్ని ప్రైవేటు గోదాముల్లో నింపాలని సీఎం కేసీఆర్ సూచన మేరకు ధైర్యంగా జీవో ఇచ్చామన్నారు. ఈ జీవో రాకుండా చాలా ఒత్తిళ్లు వచ్చినా…ప్రభుత్వం గోదాములను నిలబెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించినట్లు చెప్పారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చామని, మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ వల్ల మరో 12 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. దీంతో పాటు రైతులకు ఎకరానికి 4 వేల రూపాయలను పంట పెట్టుబడిగా ఇచ్చామన్నారు, రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం వల్ల పంట దిగుబడులు పెరిగాయన్నారు.

Minister Harish Rao

గత కాంగ్రెస్ హయంలో రైతులు ఎరువులు, విత్తనాలు కోసం పట్టణాల్లో లైన్లు కడితే గాని దొరకని పరిస్థితి ఉందన్నారు. ఎరువులు, విత్తనాలు దొరికితే రైతుకు పంట రుణాలు దొరకక బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదన్నారు. అప్పటికీ రైతులు రుణం దొరకక అధిక వడ్డీకి బయట నుంచి రుణాలు తెచ్చుకునే వారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉంటే వార్త…. అని..తమ ప్రభుత్వ హయాంలో కరెంటు పోతే వార్త అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ కు దొంగ కరెంటు అన్న నామకరణం చేశారన్నారు. ప్రతీ రోజు వార్తా పత్రికలు చూస్తే…ఐదారు వార్తలు రైతుల ఆత్మహత్యలపైనే ఉండేవన్నారు. ఇలాంటి కాంగ్రెస్ నేతలు నీటి రాజకీయం చేయాలని చూశారన్నారు.

ఎస్సారెస్పీలో తాగు నీటికి మాత్రమే నీరు ఉంటే….సాగు నీరుకు ఎందుకు ఇవ్వడం లేదని ధర్నాలు చేశారని చెప్పారు. ఆ నీరు సాగుకు ఇచ్చేస్తే…..వేసవిలో కాంగ్రెస్ నేతలు మళ్లీ తాగు నీరు ఇవ్వాలేదని రాజకీయం చేసేవారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దేవుడు సైతం కాంగ్రెస్ నేతల రాజకీయాలు చూసి… విసిగిపోయి…..వర్షాలు బాగా కురిపించారని చెప్పారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని, మళ్లీ రైతు బంధు పథకంలో భాగంగా ఎకరానికి 4 వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటికే పంటలకు మద్ధతు ధరతో కందులు, మక్కలు, శనగలు, పెసలు, ఉల్లి ని తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. పంటలు పండి దిగుబడి పెరిగే అవకాశం ఉన్నందున ఆయా రకాల పంటల నిల్వకు అనుగుణంగా గిడ్డంగుల సంస్థ ఉద్యోగులు పని చేయాలన్నారు. టెక్నాలజీని సైతం అందిపచ్చుకుని మరింత ముందుకు పోవాలన్నారు. అందుకు ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇప్పించాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

Minister Harish Rao

భవిష్యత్‌లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బలపడుతుందని.. ఇంకా విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు. సంస్థ ఆదాయం పెంచితే ఉద్యోగులకు ఇన్సెటివ్ ఇస్తామన్నారు. గతంలో ఉన్నప్పటికీ మధ్యలో దాన్ని ఆపేశారని…తిరిగి తాము పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు.అందరు బాధ్యత తో కష్టపడి చేసి ముందుకు తీసుకువెళ్లాలని గిడ్డంగుల సంస్థ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సంస్థలో ఖాళీలను కూడా భర్తీ చేస్తామని చెప్పారు. సంస్థ కన్నతల్లి లాంటిదని… సంస్థను కాపాడుకోవాలి.ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చెయ్యాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ, సింగరేణి వంటి సంస్థల బలోపేతానికి ఎన్నో చర్యలు చేపట్టారన్నారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వజ్రోత్సవాలు జరిగే సమయంలో ఈ కార్పోరేషన్ కు నేను చైర్మన్ ఉండటం తన అదృష్టమని రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్ మందుల సామేల్ చెప్పారు. కేసీఆర్ నాయకత్వం లో ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణ లో చైర్మన్ అవుతానని తానేన్నడూ భావించలేదన్న ఆయన ఈ బాధ్యత అప్పగించిన మంత్రి హరీష్, రావు కు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గిడ్డంగుల శాఖ లో పనిచేస్తున్న వారి అందరి కృషి తో దేశంలోనే తాము నెంబర్ 1 గా నిలిచామన్నారు.. దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి గాను కేసీఆరే ఉన్నారని చెప్పారు. గిడ్డంగుల శాఖ లో ఖాళీలను భర్తీలు చెయ్యాలని మంత్రి హరీష్ రావును ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -