కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మరోసారి తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచేలా పీయూష్ గోయల్ మాట్లాడారు. మమ్మల్ని నాలుగు మాటలు అంటే పడుతాం. తెలంగాణ రైతాంగాన్ని, ప్రజల్ని అవమానపరిస్తే సహించేది లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. గోయల్‌కు అహంకారింపులు, వక్రీకరణలు అలవాటుగా మారాయి. మా మంత్రులు వెళ్లి యాసంగిలో పండే పంట బాయిల్డ్ రైస్ మాత్రమే అని చెప్పినప్పుడు.. మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయించండి అని అవమానించారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రజలను కించపరిచేలా గోయల్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన హరీశ్.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష గోయల్ వ్యాఖ్యలతో మరోమారు బట్టబయలైందని ఆరోపించారు. తెలంగాణ రైతులను అవమానిస్తే ఊరుకునేది లేదని చెప్పిన హరీశ్.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలంటూ గోయల్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనని తేల్చిచెప్పారు. గోయల్ ఓ కేంద్ర మంత్రిలా కాకుండా ఓ వ్యాపారిలా మాట్లాడుతున్నారని కూడా హరీశ్ ధ్వజమెత్తారు. నూకలైనా తింటాం గానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.