పేద ప్రజలకు ఉచిత,మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్లో కొత్తగా ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే వివేకానంద్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బస్తీ దవాఖానాల్లో మందుల కొరత లేదని స్పష్టం చేశారు. బతుకుదెరువు కోసం వచ్చిన వారికి, పేదలకు రెక్కాడితేగాని డొక్కాడదని, ఇలాంటి వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఈ దవాఖానాలు పేదలకు అందుబాటులో ఉంటాయని, ఇవి నిత్యం తెరిచే ఉంటాయని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే 199 బస్తీ దవాఖానాల్లో సేవలందుతున్నాయని చెప్పారు. వార్డుకు రెండు చొప్పున 300 దవాఖానాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.