రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా వరంగల్‌లోని ఎంజిఎం దవాఖానలో కొవిషీల్డ్ టీకా తొలి డోసు వేయించుకున్నారు. అలాగే తమ సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, వారి కుటుంబ సభ్యులు టీకాలు వేయించుకున్నారు. అలాగే మేయర్ గుండా ప్రకాష్ రావు కూడా టీకా తీసుకున్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మేయర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, డిఏంహెచ్ వో, ఎంజీఎం సూపరింటెండెంట్ తదితరులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి పెద్దగా లేదని చెప్పారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మొదటి కరోనా వైరస్ నే ఎదుర్కొన్న మనకు రెండో వైరస్ పెద్దగా లెక్క కాదన్నారు. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ నిత్య జీవన వ్యవహారాలు చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కరోనాపై జరుగుతున్న పోరులో శాస్త్రవేత్తలు, డాక్టర్లు, నర్సులు, ఇతర మెడికల్, పారా మెడికల్ సిబ్బంది ఫ్రంట్ వారియర్లు చేస్తున్న కృషిని మంత్రి కొనియాడారు.
ఇక ప్రజలు ప్రభుత్వ దవాఖానాలలోనే టీకాలు తీసుకోవాలి. ప్రజలు భరోసాగా ఉండండి. నిన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లోనే టీకా తీసుకున్నారు. నేను, నా కుటుంబ సభ్యులు అంతా కలిసి ప్రభుత్వ ఎంజీఎం హాస్పిటల్స్ లోనే టీకాలు వేయించుకున్నమని అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ దవాఖానలోనే టీకాలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే కరోనా సమయంలో ఎంజీఎం వంటి ప్రభుత్వ దవాఖాన లలోనే మంచి వైద్యం అందించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ దవాఖానలలో కావాల్సిన అన్ని టీకాలు అందుబాటులోనే ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
కాగా, 60 ఏండ్లు పైబడిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని సూచించారు. అర్హులైన వారంతా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న దవాఖానల్లో టీకా వేయించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడుత కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యిందని, ఇందులో భాగంగా 60 ఏండ్లు పైబడిన వారితోపాటు 45-59 ఇండ్లల్లో ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు టీకాలు వేయనున్నారని మంత్రి చెప్పారు. రెండు కేటగిరీల్లో 50 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు 90 కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి టీకా పంపిణీ చేస్తారు. cowin.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి టీకా వేయనున్నారని మంత్రి వివరించారు.ఇదిలా ఉండగా… రాష్ట్రంలో 1200 కేంద్రాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 136 కేంద్రాలు, వరంగల్ అర్బన్ జిల్లాలో 49 కేంద్రాల్లో వాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు.