కలహాల కాషాయం.. నిజామాబాద్ బీజేపీలో వర్గ విబేధాలు..

137
Dharmapuri Aravind
- Advertisement -

నిజామాబాద్ జిల్లా కాషాయ పార్టీలో కుమ్ములాటలు..బీజేపీ ఎంపీ అర్వింద్‌కు నిద్రపట్టకుండా చేస్తున్నాయి..జిల్లాలో కీలక నేతలంతా ఎవరికి వారు పట్టు సాధించేందుకు పోటీ పడుతుండడంతో నిజామాబాద్ బీజేపీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన ధర్మపురి అర్వింద్ 5 రోజుల్లో పసుపుబోర్డు తీసుకువస్తానని బాండు పేపర్ మీద రాసిచ్చి పసుపు రైతులను మభ్యపెట్టి గెలిచాడు. కాని జిల్లాలో ఏడాది క్రితం వరకు బీజేపీని నడిపించేందుకు సరైన నాయకులే లేరు. నిజామాబాద్‌ అర్బన్‌ వంటి ఒకటీ రెండు చోట్ల మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కార్యకర్తలున్నప్పటికీ, పార్టీని నడిపించే నాయకులు లేకుండా పోయారు. దీంతో నాయకత్వ సమస్యను అధిగమించేందుకు ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మల్లికార్జున్‌రెడ్డి, బోధన్‌లో మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, బాన్సువాడలో మాల్యాద్రిరెడ్డిలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా జిల్లాలో నాయకత్వ సమస్యను అధిగమించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఈ తరుణంలో ముఖ్య నేతల మధ్య ఉన్న విభేదాలు బట్టబయలవుతుండటం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌లను కలవరపెడుతోంది. తాజాగా నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశంలో కీలక నేతల మధ్య భేదాభిప్రాయాలు బట్టబయలైనట్లు సమాచారం. ఇటీవల బాన్సువాడలో నిర్వహించిన బహిరంగ సభ నిర్వహణ తీరుపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశానికి నిజామాబాద్‌ నగరానికి చెందిన మహిళా కార్పొరేటర్లు హాజరు కావడంపై ఒకరిద్దరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం వివాదానికి దారి తీసినట్లు సమాచారం. ఇతర ప్రధాన పార్టీలతో పోలిస్తే..మనువాద సంస్కృతిని అనుసరించే బీజేపీలో మహిళానేతలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలన్న పురుష దురంహ‍కారం బీజేపీ నేతల్లో అణువణువునా ఉంటుంది. అందుకే పార్టీలో కొందరు మహిళా నేతలు చురుకుగా వ్యవహరిస్తుండడంతో నిజామాబాద్ జిల్లా బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారంట.. మహిళా నేతల దూకుడు పట్ల జిల్లాపదాధికారుల సమావేశంలో కీలక నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారంట.

అయితే పార్టీలో మహిళల ప్రాధాన్యత పెంచాల్సిన నాయకులు.. మహిళా కార్పొరేటర్ల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై ఎంపీ అర్వింద్ సైతం అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా నేతల కోసం అర్వింద్‌ ప్రత్యేకంగా రోప్‌ పార్టీని ఏర్పాటు చేయించారట. నిరసన కార్యక్రమాల సందర్భంగా మహిళా నేతలు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా రక్షణ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి పరిస్థితిలో మహిళా నేతల హాజరుపై జిల్లా బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. కాషాయ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలను బయటపెట్టినట్లైంది. ఇప్పటికే ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో బీజేపీ నేతల మధ్య వర్గ విబేధాలు బండికి చికాకు పడుతున్నాయి. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో పార్టీపై పట్టుకోసం బీజేపీ కీలక నేతలు కొట్టుకుంటుండంతో అధ‌్యక్షుడు బండి సంజయ్‌ను, ఎంపీ అర్వింద్‌లు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారంట. కాగా పసుపు బోర్డు విషయంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న అర్వింద్‌.. జిల్లా బీజేపీ నేతల మధ‌్య రగులుతున్న వర్గ విబేధాలు చివరకు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ తన కొంప ముంచుతాయో అని ఆందోళన చెందుతున్నాడంట..మొత్తంగా నిజామాబాద్ జిల్లా బీజేపీ నేతల మధ‌్య చెలరేగుతున్న కలహాలు కాషాయపార్టీ క్యాడర్‌‌ను టెన్షన్‌కు గురి చేస్తున్నాయి.

- Advertisement -