బీజేపీకి గుడ్‌బై చెప్పిన మరో మిత్రపక్షం..!

145
bjp
- Advertisement -

దేశంలో అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తూ, ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలను కూలదోస్తూ..ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేస్తూ, రాష్ట్రాల హక్కులన్నింటిని లాగేసుకుంటూ.. ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశ పాలకుడిగా మారుతున్నారు. ఓ పక్క మూడు నెలలుగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై ఆందోళనలు చేస్తున్న రైతులను బీజేపీ నేతలు ఖలిస్తాన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటూ కించపరుస్తుంటే ప్రధాని మోదీ మాత్రం తన గడ్డం నిమురుకుంటూ తాపీగా వినోదం చూస్తున్నారు. అంతే కాదు కొత్త వ్యవసాయ, విద్యుత్, బిల్లులతో రాష్ట్రాల హక్కులను లాగేసుకుంటూ..ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారు.

జీడీపీ పెంచుతామని చెప్పిన పెద్దమనిషి గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలను పెంచి దేశ ప్రజలకు మోయలేని భారం మోపుతున్నారు. నల్ల ధనం ఊసు లేదు, 2 కోట్ల ఉద్యోగాల భర్తీని అటకెక్కించేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను మెల్లగా ప్రైవేటీకరణ చేస్తూ అంబానీలు, అదానీలకు దేశాన్ని తాకట్టుపెడుతున్నారు.. మోదీ డైరెక్ట్‌గా ఈ విషయాన్ని చెప్పేశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలపై సీబీఐని ఉసిగొల్పి నయానో, భయానో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కరోనాతో సామాన్యుడి బతుకు మరింత భారమైంది. పైగా నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక యువత తీవ్ర నిరాశ, నిస్పృహలొ ఉంది. బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై యావత్ దేశంలో నిరసన జ్వాలలు రగులుతున్నాయి.

ముఖ్యంగా రైతుల పట్ల బీజేపీ అనుసరిస్తున్న తీరుపై, జీడీపీ అదే గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. బీజేపీ నిరంకుశ విధానాలపై అధికార ఎన్డీయే కూటమిలోని పార్టీలు కూడా మండిపడుతున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ముందుగా తోటి మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ ఎన్టీయేకు గుడ్‌బై చెప్పింది. ఆ పార్టీకి చెందిన కేంద మంత్రి హరిసిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతుగా శిరోమణి అకాలీదళ్ పార్టీ ఎన్డీయేలోంచి బయటకు వచ్చేసింది.

తాజాగా అసోంలో అధికార బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంత కాలం మిత్రపక్షంగా ఉన్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీజేపీకి గుడ్ బై చెప్పింది. అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మోదీ, అమిత్‌షాలు రానున్న నేపథ్యంలో మిత్రపక్షం బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీజేపీకి రాంరాం చెప్పేసి కాంగ్రెస్ కూటమిలో చేరడం బీజేపీకి షాకింగ్‌‌గా మారింది. తాము కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చేరుతున్నట్లు బోడోలాండ్ పీపీల్స్ ఫ్రంట్ ప్రకటించింది. ‘‘శాంతి, ఐక్యత, అభివృద్ధి సాధన కోసం అలాగే అస్సాంలో అవినీతి రహితమైన స్థిరమైన ప్రభుత్వం కోసం మహాజాథ్‌తో కలిసి బీపీఎఫ్ పోటీ చేస్తుంది’’ అని ఆ పార్టీ అధ్యక్షుడు హగ్రామ మోహిలరీ ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీతో తాము తెగతెంపులు చేసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీతో ఉన్న ఐదేళ్ల బంధాన్ని తెంచుకుని మరీ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమిలో చేరడం అసోం రాజకీయాలను కుదిపేస్తోంది. ఈసారి ఎన్నికలలో గట్టిపోటీ తప్పదని భావిస్తున్న తరుణంలో మిత్రపక్షం కాంగ్రెస్ కూటమిలో చేరడంతో అసోం బీజేపీ డీలా పడింది. మొత్తంగా మిత్రపక్షాలు వరుసగా గుడ్‌బై చెబుతుండడంతో దేశంలో బీజేపీ పతనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ పాలనలో దేశ ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్న పరిస్థితులలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఫెడరల్‌ ఫ్రంట్‌ కూటమిగా ఏర్పడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

- Advertisement -