అవినీతి పరులను,భూ కబ్జా దారులను ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి… సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను కొత్తగా తీర్చిదిద్దాదని చెప్పారు. వాహనాలను, ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందించారు.. నేరస్థులకు ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతోందన్నారు. నేరాలను పోలీస్ శాఖ సవాల్‌గా తీసుకుని పూర్తిగా నియంత్రిస్తోందన్నారు.
పరకాల నియోజకవర్గంలో నేరాలకు అడ్డుకట్ట పడింది… పోలీసు శాఖ తీరు, ముఖ్యంగా వరంగల్ పోలీసుల తీరు అభినందనీయం అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు… తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు. కొత్త సాంకేతిక వ్యవస్థను పోలీసు శాఖ చక్కగా వినియోగించుకోవాలి… హోంగార్డుల వేతనాన్ని నెలకు రూ.12 వేల నుంచి రూ.22 వేలకు పెంచారని చెప్పారు.