జె.హెచ్.ఆర్.ఎత్తిపోతల ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు అన్నారు. ఆదివారం సిఎం కార్యదర్శి స్మీతాసభర్వాల్, ఇయన్‌సి మురళీధర్‌రావు, మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్, మహ-బాద్ ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు డా.టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుధర్శన్‌రెడ్డి, దేవాదుల, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంత్రులు సమీక్షించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో నాటి పాలకులు ప్రారంభించిన దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేశారని అన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ రూపకల్పనలో 5.18 టియంసీల సామర్థ్యంతో 1,22,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రతిపాధించగా.. నాటి పాలకులు అవికూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ప్రత్యేక కృషితో దేవాదుల ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో పనులు పూర్తి వినియోగంలోకి తీసుకరావడానికి అహర్నిషలు కృషి చేయడంతో పాటు, ప్రాజెక్ట్‌ను మరింత అభివృద్ది పరిచి ఉమ్మడి జిల్లాలోని 6లక్షల25వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు 60 టియంసీల గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
అందులో భాగంగానే 9 నెలల పాటు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు తుపాకులగూడెం వద్ద సమ్మక్క-సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు. దేవాదుల ఎత్తిపోతల నీటిని నిల్వ కోసం ఇప్పటి వరకు కేవలం 8 టియంసీల నీటి సామర్థ్యం ఉందని, కరువు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతాంగానికి సాగునీరు అందించేందుకు రిజర్వాయర్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మరో 10 టియంసీల సామర్థ్యంతో లింగంపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. ప్యాకేజీ-6 లోని ఉప్పుగల్లు, పాలకుర్తి, చెన్నూర్ రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు త్వరలోనే టెండర్లను పిలుస్తామని అన్నారు. నర్సంపేట, పరకాల, పాలకుర్తి, జనగామ నియోజకవర్గాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో దేవాదుల కాలువల నిర్మాణాలకు పెండింగ్‌లో ఉన్న భూసేకరణను త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో అవసరమైన ప్రతి చోట చెక్ డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు.