రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పెద్దపల్లి, భూపాలపల్లి జెడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నేతలతో వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
టిఆర్ఎస్ శ్రేణులు మరోసారి సైనికులు కావాలి. ఉద్యమ స్ఫూర్తితో కరోనా వైరస్ నిర్మూలనోద్యమంలో పాల్గొనాలి. ఈ కష్ట కాలంలో గులాబీ దండు జనంతో ఉండాలి. పార్టీ కేడర్ మొత్తం ప్రజలకు అండదండగా అందుబాటులో ఉండాలి. అలాగే ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న భరోసాని రైతులకు ఇవ్వాలి. ఉద్యమ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యాన్ని మనమే నిర్దేశించుకోవాలి. మన సీఎం కెసిఆర్, మన ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు వివరించే బాధ్యతను మనమే తీసుకోవాలి. సామాజిక దూరాన్ని పాటిస్తూనే, సామాజిక బాధ్యతను నిర్వర్తించాలి. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో ఉన్న మంత్రి తన ఇంటి నుంచే ఆదివారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వేర్వేరు చోట్ల ఉన్న రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణీ, ఎంపీలు, బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట్రమణారెడ్డి, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నేతలను లైన్ లోకి తీసుకుని వాళ్ళందరితో తాజా పరిస్థితులను సమీక్షించారు. సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాటి ఉద్యమ స్ఫూర్తిని పార్టీ శ్రేణులు మళ్ళీ నింపుకోవాలి. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన తీరుగా, ఈ నాడు కరోనా వైరస్ కారణంగా తలెత్తిన సమస్యలపై పోరాడాలి. తెచ్చుకున్న తెలంగాణని కాపాడుకోవడానికి సమాయత్తం కావాలి. కరోనా కట్టడి కష్టకాలంలో మన సీఎం కెసిఆర్ తీసుకుంటున్న చర్యలను ప్రజలకు చెప్పండి. ప్రపంచమంతా మన కెసిఆర్ ను మెచ్చుకుంటున్నది. ఆయన ధైర్య సాహసాలను అభినందిస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ముందుగానే లాక్ డౌన్ విధించి ప్రజలను కాపాడుతున్నారు. నష్టాలను లెక్క చేయడంలేదు. ప్రజల ప్రాణాలే ముఖ్యమంటున్నారు. అలాగే అప్పు తెచ్చి రూ.30వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతుల ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇవ్వండి. అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ, భరోసానివ్వాలి. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలి. పేదలకు అన్నం పెట్టండి. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు వెన్నుదన్నుగా నిలవండి. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. రైతు బంధు సమన్వయకర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు క్రియా శీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.