తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టానికి నాంది పలికిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా నేడు నార్నూర్‌లో నిర్వహించిన ఎడ్ల బండ్ల ర్యాలీలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ర్యాలీకి స్థానిక రైతులు, మహిళలు పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రాథోడ్ బాపురావు, ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, మాజీ ఎంపీ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్త రెవెన్యూ చట్టంతో అన్నదాతల కష్టాలు పూర్తిగా తొలగనున్నాయయని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో పారదర్శకత ఉంటుందని, లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమేనన్నారు. ఎవరు కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖలో విచ్చలవిడిగా జరుగుతున్న భూ మార్పిడులు, పుస్తకాల జారీ, ప్రభుత్వ భూముల బదిలీ, బినామీ పేర్లతో భూకబ్జాలను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారన్నారు. ఇప్పటి వరకు భూమి కొన్నతర్వాత మ్యుటేషన్ కోసం రైతు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ సమస్య ఉండదని పేర్కొన్నారు.