పశ్చిమ బెంగాల్ రాజకీయంలో ఒక ఉత్కంఠభరితమైన చర్చ నడుస్తోంది. అక్టోబర్ 6న జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో నందిగ్రామ్ స్థానాన్ని కాంగ్రెస్‌కు విడిచిపెట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ పొత్తు ప్రతిపాదన పంపారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ఈ ఆరోపణలను టీఎంసీ తీవ్రంగా ఖండించింది. నందిగ్రామ్ ఉపఎన్నిక నుంచి టీఎంసీ తప్పుకొని ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు కేటాయిస్తుందని దానికి ప్రతిఫలంగా ముర్షిదాబాద్ జిల్లాలోని ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న ‘రెజినగర్’ స్థానాన్ని కాంగ్రెస్ టీఎంసీకి వదిలేయాలని ప్రతిపాదన వచ్చినట్లు ప్రదీప్ భట్టాచార్య తెలిపారు.
మమతా బెనర్జీ ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానంతో, ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌తో సంప్రదింపులు జరిపారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర నాయకత్వంతో చర్చించగా, పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పీసీసీ ఈ పొత్తు ప్రతిపాదనను తెగేసి తిరస్కరించింది. టీఎంసీని రక్షించడానికి లేదా మళ్లీ నిలబెట్టడానికి మేమెందుకు సహాయం చేయాలి? టీఎంసీ క్యాడర్ బలహీనపడుతున్న వేళ ఒంటరిగా పోరాడి మా పార్టీని బలోపేతం చేసుకోవడమే సరైన నిర్ణయం అని రాష్ట్ర కాంగ్రెస్ స్పష్టం చేసింది.
కాంగ్రెస్ చేస్తున ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని టీఎంసీ సీనియర్ నేత కుణాల్ ఘోష్ కొట్టిపారేశారు. అసలు అలాంటి ప్రతిపాదనే తమ పార్టీ నుంచి వెళ్లలేదని స్పష్టం చేశారు. నందిగ్రామ్ ప్రాంతం గతంలో మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి పునాదిగా నిలిచిన చారిత్రక స్థానం. అయితే 2021 సాధారణ ఎన్నికల్లో అలాగే ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో కూడా బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో అక్కడ టీఎంసీ పరాజయాన్ని చవిచూసింది. వరుస ఓటముల నేపథ్యంలో నందిగ్రామ్‌లో హ్యాట్రిక్ ఓటమిని తప్పించుకోవడానికే టీఎంసీ ఈ ఎత్తుగడ వేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా రెండు పార్టీల మధ్య ఈ ప్రతిపాదన వివాదం బెంగాల్ ఉపఎన్నికల హీట్‌ను మరింత పెంచింది.
Also Read:సూర్య–జ్యోతిక..మళ్లీ పెళ్లి

