సూర్య–జ్యోతిక..మళ్లీ పెళ్లి

2
- Advertisement -

కోలీవుడ్ నటుడు సూర్య, నటి జ్యోతికల జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది చిత్రసీమలో అత్యంత ఆదర్శవంతమైన దంపతులుగా పేరు తెచ్చుకున్న ఈ జంట, తమ 20 ఏళ్ల వైవాహిక బంధాన్ని పురస్కరించుకుని మరోసారి వెడ్డింగ్ వౌస్ (పెళ్లి ప్రమాణాలు) స్వీకరించారు.

తమ 20 ఏళ్ల ప్రేమ ప్రయాణాన్ని వినూత్నంగా జరుపుకునేందుకు ఈ జంట ఒక చర్చిలో ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో సూర్య-జ్యోతికలు తెల్లటి సాంప్రదాయ దుస్తుల్లో ఉంగరాలు మార్చుకుని మరొకసారి తమ ప్రేమను చాటుకున్నారు.

ఈ చిరస్మరణీయ ఘట్టానికి వారి పిల్లలు దియా, దేవ్ ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు. వారితో పాటు సూర్య సోదరుడు కార్తి, ఇతర కుటుంబ సభ్యులు మరియు ఆప్తమిత్రులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జ్యోతిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రాసిన సందేశం అభిమానుల హృదయాలను హత్తుకుంటోంది. “ఇది ‘ద సీక్వెల్’.. మా 20 ఏళ్ల ప్రేమ, పోరాటాల వేడుక. ఇది ఏమీ పర్ఫెక్ట్ వివాహ బంధం కాదు. లోపాలు, సర్దుబాట్లు, అవగాహన, త్యాగాలు మరియు స్వార్థం లేని ప్రేమల కలయిక. కాలంతో పాటు ఒకరి కోసం ఒకరం ఎంతగా మారమో తెలిపే సంబరం” అంటూ జ్యోతిక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Also Read:అమెరికాకు లొంగిపోయిన మోదీ!

జ్యోతిక వైట్ వెడ్డింగ్ గౌనులో ఎంట్రీ ఇస్తుంటే సూర్య కంటతడి పెట్టుకోవడం ఆ తర్వాత ఇద్దరూ రింగులు మార్చుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ అన్యోన్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

- Advertisement -