డిజిటల్ మీడియా, ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిపై నియంత్రణ తెచ్చేందుకు జాతీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఒక అనధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. ఓటీటీల్లో ప్రసారమయ్యే అసభ్యకర కంటెంట్ వల్ల సమాజంలో ‘సాంస్కృతిక కాలుష్యం’, నైతిక పతనం పెరుగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇందులో మాజీ వైస్ ఛాన్సలర్లు, విద్య, సాంస్కృతిక, న్యాయ రంగాలకు చెందిన నిపుణులు మరియు ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ ప్రచారకులు సభ్యులుగా ఉన్నారు. ఓటీటీ కంటెంట్‌ను నియంత్రించడానికి థియేటర్లలో ప్రదర్శించే చిత్రాలకు ఉండే సెన్సార్ బోర్డ్ (CBFC) లాంటి వ్యవస్థను లేదా స్పష్టమైన నియమావళిని రూపొందించాలని ఈ కమిటీ ప్రతిపాదించనుంది.
న్యాయనిపుణులతో విస్తృత చర్చల అనంతరం ఈ కమిటీ తయారు చేసే నివేదికను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సంబంధిత విభాగానికి సమర్పించనున్నారు.
Also Read:సూర్య–జ్యోతిక..మళ్లీ పెళ్లి
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో చూపిస్తున్న కొన్ని విషయాలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. ఇవి సమాజంలో నైతిక పతనానికి ప్రధాన కారణమవుతున్నాయి. చట్టం ద్వారా వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది అని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. సమాజంలో సాంప్రదాయ కుటుంబ విలువలను పునరుద్ధరించడానికి ఆర్‌ఎస్‌ఎస్ చేపట్టిన ‘కుటుంబ ప్రబోధన్’ కార్యక్రమంలో వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి.
ప్రస్తుతం థియేటర్ సినిమాలకు ‘సినీమటోగ్రాఫ్ యాక్ట్, 1952’ కింద సెన్సార్షిప్ ఉంటుంది. కానీ ఓటీటీ కంటెంట్ కేవలం ‘ఐటీ నిబంధనలు 2021’ పరిధిలోనే నడుస్తోంది. ఈ నియంత్రణ లోపాలను సరిదిద్దడమే తమ కమిటీ ముఖ్య ఉద్దేశమని ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు వెల్లడించారు.

