తెలంగాణలో సంచలనం సృష్టించిన గుర్రంబోడు రాళ్లదాడి కేసు దర్యాప్తులో హుజూర్‌నగర్ పోలీసులు స్పీడప్ పెంచారు. రాళ్లదాడిలో పాల్గొన్న బీజేపీ నేతలు, కార్యకర్తలను గుర్తించి వరుసగా అరెస్టులు చేస్తున్నారు. గుర్రంబోడులోని వివాదాస్పద భూముల వ్యవహారాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకునేందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పక్కా స్కెచ్ వేశారు. గిరిజన రైతు భరోసా యాత్ర పేరుతో బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, విజయశాంతి, రాజాసింగ్, జితేందర్ రెడ్డి వంటి నేతలు బస్సులో గుర్రంబోడుకు వెళ్లారు. వివాదాస్పద భూముల దగ్గరకు తమ అగ్ర నేతలు రాగానే ముందస్తు పథకం ప్రకారం కాషాయ కార్యకర్తలు రెచ్చిపోయారు. అక్కడ ప్రైవేట్ కంపెనీ చేపట్టిన నిర్మాణాలను కూలగొట్టారు.
దీంతో అడ్డుకున్న పోలీసులపై కాషాయ మూకలు ఒక్కసారిగా రాళ్లదాడికి దిగడంతో సూర్యాపేట డీఎస్పీ, హుజూర్‌నగర్ సీఐతో సహా పలువురు ఎస్సైలు, పోలీసుల తలలు పగిలాయి. గుర్రంబోడు రాళ్లదాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావులతో సహా మొత్తం 21 మందిపై మఠంపల్లి పోలీసులు వివిద సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. హుజూర్‌నగర్ పోలీసులు కూడా ఈ ఘటనపై కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.
బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరభద్రం, జిల్లా కార్యదర్శి నున్న రవితో సహా పలువురు బీజేపీ నేతలను, కార్యకర్తలను హుజూర్‌నగర్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. తాజాగా మల్కాజ్‌గిరిలో హుజూర్‌నగర్ పోలీసులు ముగ్గురు బీజేవైఎం నేతలను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గుర్రంబోడు రాళ్లదాడి ఘటనలో పాల్గొన్న మల్కాజ్‌గిరి 140 డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు అర్థరాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అరెస్ట్ విషయం సమాచారం అందడంతో శ్రవణ్ ఇంట్లో ఉండకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. అర్థరాత్రి హుజూర్‌నగర్ పోలీసులు తమ ఇంటికి రావడంతో శ్రవణ్ కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రవణ్ ఇంట్లో లేకపోవడంతో వాణీనగర్‌కు చెందిన బీజేపీ యువమోర్చాకు చెందిన చందు, ఓల్డ్ సణిల్‌గూడకు చెందిన భరత్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి తమతో తీసుకువెళ్లారు. కాగా అరెస్ట్ భయంతో బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.
అయితే కార్పొరేటర్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజే అర్థరాత్రి అరెస్ట్ చేసేందుకు పోలీసులు రావడం కక్ష సాధింపు అని కాషాయ నేతలు గుస్సా అవుతున్నారు. గుర్రంబోడు రాళ్లదాడి ఘటనలో పోలీసు అధికారులు గాయపడడంతో హుజూర్‌నగర్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. వరుసగా బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. రాళ్లదాడిలో పాల్గొన్న ఏ ఒక్కరిని వదిలేది లేదని పోలీసులు అంటున్నారు. మొత్తంగా గుర్రంబోడు రాళ్లదాడి కేసులో వరుసగా బీజేపీ నేతలు అరెస్ట్ అవుతుండడంతో కాషాయ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ కేసులో మున్ముందు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో చూడాలి.