కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా మహారాష్ట్రలో అత్యంత వైభవంగా జరిగే ‘దహీ హండి’ (Dahi Handi) ఉత్సవాల్లో పాల్గొనే ‘గోవిందా’లకు (మానవ పిరమిడ్లు నిర్మించే యువకులు) ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉత్సవాల వేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో, గోవిందాల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూ. 10 లక్షల సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించింది.
ఉత్సవాల్లో పాల్గొనే యువతకు వారి కుటుంబాలకు ఆర్థిక ధీమా కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్సవాల్లో మానవ పిరమిడ్లు నిర్మించే సమయంలో అనుకోకుండా ప్రమాదం జరిగి మరణించినా లేదా శాశ్వత సంపూర్ణ వైకల్యం బారిన పడినా బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల బీమా పరిహారం అందుతుంది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే దహీ హండి కార్యక్రమాల్లో సుమారు 1.60 లక్షల మంది గోవిందాలు పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వారందరికీ ఈ ఉచిత బీమా వర్తిస్తుంది. బీమా సదుపాయం కల్పించడంతో పాటు, ఉత్సవ నిర్వాహకులు మరియు పాల్గొనే గోవిందాలు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. పిరమిడ్లు నిర్మించే సమయంలో తగిన హెల్మెట్లు, సేఫ్టీ గేర్లను ఉపయోగించాలని, నిబంధనలను అతిక్రమించవద్దని సూచించారు.
రాష్ట్రంలో సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్న దహీ హండి క్రీడను మరింత ప్రోత్సహించడంతో పాటు, ఇందులో పాల్గొనే యువత ప్రాణాలకు రక్షణ కల్పించే దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై గోవిందా బృందాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read:కాంగ్రెస్‌కు సీపీఐ కూనంనేని తీవ్ర హెచ్చరిక

