సీఎం విజయ్ వర్సెస్ ఉదయనిధి

0
- Advertisement -

కర్ణాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మేకదాటు ఆనకట్ట ప్రాజెక్టు వివాదం తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మరియు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మేకదాటు ప్రాజెక్టును అడ్డుకోవడంలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

కర్ణాటక ప్రభుత్వం మేకదాటు ప్రాజెక్టు వైపు వేగంగా అడుగులు వేస్తోంది. వారిలాగే మనం కూడా రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉన్నామని చాటాల్సిన అవసరం ఉంది…రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో ‘అఖిలపక్ష సమావేశం’ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా..ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. సీఎం విజయ్ కర్ణాటక పర్యటనకు వెళ్తున్నారంటూ ఇరు రాష్ట్రాల మంత్రుల నుంచి భిన్నమైన ప్రకటనలు వచ్చాయని, ఈ పర్యటనపై స్పష్టత ఇవ్వాలని నిలదీశారు.

ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా ఖండించారు. తమిళనాడు ప్రజల, రైతుల హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మేకదాటు అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ సున్నితమైన సమస్యపై చౌకబారు రాజకీయాలు చేయకండి అని విజయ్ కౌంటర్ ఇచ్చారు. మేకదాటు ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం ఆమోదించామని, స్వయంగా తానే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా రాష్ట్ర నిరసనను తెలియజేశానని చెప్పారు.

Also Read:కాంగ్రెస్‌కు సీపీఐ కూనంనేని తీవ్ర హెచ్చరిక

ఈ వ్యవహారాన్ని న్యాయపోరాటం ద్వారానే పరిష్కరిస్తామని, రాజకీయ ప్రయోజనాల కోసం లేదా క్రెడిట్ కొట్టేయడం కోసం లబ్ధి పొందాలని చూడవద్దని ఉదయనిధికి హితవు పలికారు.

- Advertisement -