తెలంగాణ రాజకీయం మిత్రపక్షాల మధ్య మాటల యుద్ధంతో ఒక్కసారిగా వేడెక్కింది. మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ వైఖరిపై సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని ఏడుఅల్లాబయ్యారంలో నిర్వహించిన ‘ప్రజా చైతన్య యాత్ర’ ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
కమ్యూనిస్ట్ పార్టీ బలాన్ని తక్కువగా అంచనా వేసి తమను అవమానించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని కూనంనేని స్పష్టం చేశారు. మొక్కే కదా అని పీకేద్దాం అనుకుంటే పీక కోస్తాం. పది మందే ఉన్నారు అని మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే మీ సంగతి చెప్తాం. మమ్మల్ని అవమానిస్తే మిమ్మల్ని కాపాడేవారు ఎవరూ ఉండరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మమ్మల్ని వీడి అవమానిస్తే, మీ శిలాఫలకాన్ని మీరే పెట్టుకున్నట్టు, మీ శవపేటికను మీరే తయారు చేసుకున్నట్టు అవుతుంది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తమను నిర్లక్ష్యం చేసిన పార్టీలకు పట్టిన గతే అధికార పార్టీకి కూడా పడుతుందని గుర్తుచేశారు. దేశంలో భాజపా లాంటి మతోన్మాద శక్తులు అధికారంలోకి రాకూడదనే ఏకైక ఉద్దేశంతోనే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని, తాము ఇప్పటికీ పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. అవతలి వైపు నుంచి కూడా అదే గౌరవాన్ని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మిత్రపక్షంగా గౌరవం ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో సీపీఐ సొంతంగా పోటీ చేయడానికి వెనకాడదని తేల్చిచెప్పారు. అవసరమైతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి కూడా సీపీఐ అభ్యర్థిని బరిలోకి దింపుతామని సవాలు విసిరారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీ లోపల, వెలుపల మద్దతు ఇస్తున్న సీపీఐ అగ్రనేత నుంచి ఈ స్థాయి తీవ్రమైన హెచ్చరికలు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read:వర్షాలతో అలెర్జీ..వీటితో చెక్!

