రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టం. బద్ద శత్రువులుగా ఉన్నవాళ్ళు అనూహ్యంగా చేతులు కలపడం, మిత్రుత్వం కలిగిన వాళ్ళు విడిపోవడం తరచూ చూస్తూనే ఉంటాము. తాజాగా వైఎస్ షర్మిల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు గిఫ్ట్ పంపడం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు టీడీపీ పార్టీపై నిప్పులు చెరిగిన షర్మిల ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ నేతలు గిఫ్ట్ పంపడంతో ఈ పరిణామాలు దేనికి సంకేతం అనే టాక్ వినిపిస్తోంది. వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో ఆమె తెలంగాణ పాలిటిక్స్ పైనే దృష్టి సారిస్తూ వచ్చారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రేస్ నుంచి తప్పుకొని కాంగ్రెస్ మద్దతు ప్రకటించారు. .
అప్పటి నుంచే ఆమె రాజకీయ ఫ్యూచర్ కు సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని, ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల చూసుకునే అవకాశం ఉందని ఇలా రకరకాల వార్తలు వినిపించాయి. అయితే అవేవీ కూడా వాస్తవంలోకి రాలేదు. ఇక తాజాగా క్రిస్మస్ కానుకగా నారా లోకేష్ కు ఆమె గిఫ్ట్ పంపడంతో షర్మిల టీడీపీ వైపు చూస్తున్నారా ? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఏపీ పాలిటిక్స్ వైపు చూస్తుండడం కొంత ఆసక్తి రేకెత్తించే విషయమే. అయితే ఆమె టీడీపీ వైపు వెళ్తారా ? లేదా మొదటి నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం కాంగ్రెస్ లోనే కీలకంగా వ్యవహరిస్తారా ? లేదా తెలంగాణలో మాదిరి ఏపీలో కూడా ఏ మాత్రం పోటీ చేయకుండా సైలెంట్ గా ఉంటారా ? అనేది చూడాలి.
Also Read:తెలంగాణ అంటేనే బీఆర్ఎస్:ఎంపీ రంజిత్