ఐటీ బిల్లుకు లోక్‌సభ అమోదం.. ఆ డిపాజిట్లపై భారీగా ప‌న్ను

176
Lok Sabha debates amendment to I-T Bill
Lok Sabha debates amendment to I-T Bill
- Advertisement -

ఆదాయ ప‌న్ను చ‌ట్ట స‌వ‌ర‌ణ కోసం లోక్‌స‌భలో ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు(ది టాక్సేష‌న్ లా.. సెకండ్ అమెండ్ మెంట్‌-2016)కు ఈ రోజు ఆమోదం లభించింది. లోక్‌స‌భ‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌సంగం త‌రువాత‌ మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందిన‌ట్లు లోక్‌సభ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ తెలిపారు. ఈ బిల్లు రాజ్య‌స‌భ‌లోనూ ఆమోదం పొందాల్సి ఉంది. మ‌రోవైపు బిల్లు ఆమోదం పొందే స‌మ‌యంలో విప‌క్ష నేత‌లు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఈ బిల్లుపై ఓటింగ్ కోసం విప‌క్ష‌నేత‌లు నినాదాలు చేశారు. వారి ఆందోళ‌న మ‌ధ్యే బిల్లు ఆమోదం పొందింది. అనంత‌రం లోక్‌స‌భను రేపటికి వాయిదా వేస్తున్న‌ట్లు సుమిత్రా మ‌హాజ‌న్ ప్ర‌క‌టించారు.

ఈ సందర్భంగా జైట్లీ సభలో మాట్లాడారు. నల్లధనం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టారని జైట్లీ తెలిపారు. సుప్రీంకోర్టు చెప్పినట్లు నల్లధనాన్ని బయటపెట్టే వరుస చర్యల్లో ఇదొక భాగమన్నారు. విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం తగినన్ని చర్యలు చేపట్టిందన్నారు. బినామీ ఆస్తుల వెల్లడికి ఇప్పటికే ప్రభుత్వం సభ ముందు బిల్లు పెట్టిందన్నారు. నల్లధనం మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నవాళ్లు ఈ చర్యలతో బయటపడుతారని పేర్కొన్నారు.

ప్రకటిత ఆదాయంగా ఉన్న రద్దయిన పెద్ద నోట్లను స్వచ్ఛందంగా డిసెంబర్ 30లోపు డిపాజిట్ చేస్తే దానిపై 50శాతం పన్ను తో సరిపోతుందని ఆ బిల్లు పేర్కొంటున్నది. లేనిపక్షంలో అనంతరం అధికారుల సోదాల్లో సదరు అప్రకటిత సొమ్ము పట్టుబడిన పక్షంలో దానిపై పన్నులు, జరిమానాలు కలుపుకొని గరిష్ఠంగా 75 నుండి 85శాతం వరకు చెల్లించాల్సి ఉంటుందని బిల్లులో ప్రతిపాదించారు.

ఆదాయం ప్రకటించేవారు ఆ మొత్తం ఎలా సమకూరిందో చెప్పాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కల్యాణ్ యోజన-2016 పేరుతో ఒక పథకాన్ని కేంద్రం ప్రతిపాదించింది. రద్దయిన పెద్ద నోట్లను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 మధ్యకాలంలో డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సొమ్ము మొత్తం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై)లోకి వెళుతుంది.

ఇలా జమ అయ్యే మొత్తానికి 30శాతం పన్ను, పదిశాతం జరిమానా, 30శాతం పన్నుపై 33శాతం సర్‌చార్జ్.. మొత్తం కలుపుకొని 50శాతం వరకు విధిస్తారు. ఇటువంటి డిపాజిట్లకు ఆదాయం ఎలా వచ్చిందనే ప్రశ్నలు ఉండవని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అనంతరం విలేకరులకు చెప్పారు. సంపద పన్ను, పౌర, ఇతర పన్ను చట్టాల నుంచి వీరికి మినహాయింపు ఉంటుందని, అయితే ఫెమా, పీఎంఎల్‌ఏ, నార్కొటిక్స్, నల్లధనం చట్టాల నుంచి మినహాయింపు ఉండబోదని తెలిపారు.

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రతిపక్షాలు సభలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్న సమయంలోనే పన్నుల చట్టాలు (రెండో సవరణ) బిల్లు-2016ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన మూడు వారాల తర్వాత ప్రభుత్వం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఆర్థిక బిల్లు రూపంలో దీనిని తీసుకువచ్చిన రీత్యా ఒక్క లోక్‌సభ ఆమోదమే సరిపోతుంది. ప్రతిపక్షాల సభ్యులు మెజార్టీ సంఖ్యలో ఉన్న రాజ్యసభకు దీనిని పంపించాల్సిన అవసరం ఉండదు.

 

- Advertisement -