స్ధానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలిదశ నామినేషన్ల పర్వం ముగిసింది. పల్లె పోరులో ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. తొలిదశ ఎన్నికల పోలింగ్ మే6న జరగనుండగా చివరిరోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 2166 ఎంపీటీసీ స్ధానాలకు గాను 13 వేలకు పైగా నామినేషన్లు దాఖలు కాగా 197 ఎంపీటీసీ స్ధానాలకు 2 వేలకు పైగా నామినేషన్లు వేశారు ఆశావాహులు.
అయితే కొన్నిజిల్లాల్లో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల ఏకగ్రీవ ప్రక్రియ మొదలవగా మరికొన్ని చోట్ల పోరు నువ్వా నేనా అన్నట్లు సాగనుంది. అత్యధికంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జడ్పీటీసీ స్ధానానికి 107 నామినేషన్లు దాఖలయ్యాయి.
గురువారం నామినేషన్ల పరిశీలించి, తుది పోరులో ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై శుక్రవారం అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంటుంది. 27వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి, నామినేషన్ల ఉపసంహరణకు 28 వరకు గడువిచ్చారు. ఉపసంహరణల అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఈ నెల 28 నుంచి వచ్చేనెల 4 వరకు ప్రచారం చేసుకోవచ్చు.
పరిషత్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల అభివృద్ధి కోసం అంతా ఒక్కటవుతున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రోళ్ల అనిత ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దాంతో ఆమె ఏకగ్రీవమైనట్టు ప్రకటించడమే తరువాయి.పల్లె పోరు నేపథ్యంలో గ్రామాలను వదిలివెళ్లిన విద్యావంతులు పరిషత్ ఎన్నికల్లో పాలుపంచుకొనేందుకు సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. దీంతో స్ధానిక సమరం ఆసక్తికరంగా మారింది.