విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ వాషింగ్టన్ పర్యటన కొనసాగుతుంది. నేడు ఆయన అమెరికాలో భారత రాయబారి తరుణ్‌జిత్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ, అమెరికా రాష్ర్టాల్లోని పలు రాష్ర్టాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల పెంపు కోసం సహకరించాలని కోరారు. అయితే, అమెరికా కాన్సుల్ జనరల్‌గా నియమితులైన కేథరిన్ బి హద్దాను కూడా మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులు, వారి సమస్యలను చర్చించారు.
అనంతరం బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బెర్ట్రాండ్ మార్క్‌ను కేటీఆర్ కలిశారు. హైదరాబాద్ ఏరోస్పేస్ సిటీలోని బోయింగ్ సంస్థకు సహకారంపై బెర్ట్రాండ్ మార్క్ హర్షం వ్యక్తం చేశారు. ఏరోస్పేస్ రంగంలో యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై ఇరువురితో చర్చించారు. తర్వాత క్వీవ్ లాండ్ మోటర్ సైకిల్ వర్క్, గ్లోబల్ ఎంటర్ ప్రెనర్ షిప్-2017 ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు.
ఫార్మా పెట్టుబడులపై దృష్టి సారించిన మంత్రి… అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలతో రాష్ర్టం ముందుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన కేటీఆర్… హైదరాబాద్ లోని ఔషధ కంపెనీలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు, ఫార్మాసిటీలోకి తరలించే ప్రయత్నాలను వివరించారు. ఇందుకోసం మార్గదర్శకాల రూపకల్పనలో ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రతినిధులు తెలిపారు.
క్లీవ్ లాండ్ మెటార్ సైకిల్ వర్క్ కంపెనీతో సమావేశం అయ్యారు. ఈ కంపెనీ సియివో జోనాథన్ తో సమావేశం అయిన మంత్రి తెలంగాణలో మాన్యూపాక్చరింగ్ యూనిట్ నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని, పూర్తి సహకారం ప్రభుత్వం వైపు నుండి అందిస్తామని తెలిపారు. కమ్యూనిక్లిక్ సంస్థకు చెందిన రాంరెడ్డితో మంత్రి సమావేశం అయ్యారు. హైదరాబాద్లో తమ సంస్థ విభాగాన్ని ప్రారంభించేందుకు రాంరెడ్డి ముందుకు వచ్చారు.
అమెరికా పర్యటనలో భాగంగా సిలికాన్ వ్యాలీలో రేపు టీ-హబ్ ఔట్‌పోస్ట్ టీ- బ్రిడ్జ్‌ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. వారం రోజుల్లో ఆరు రాష్ట్రాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. మంత్రి వెంట పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.