టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ యావత్ దేశానికే ఆదర్శంగా మారిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బాగ్ లింగంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన డబుల్ బెడ్రూం పధకం దేశంలో అందరిని ఆకర్షిస్తోందని తెలిపారు. పేద ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
డబుల్ బెడ్ రూం పథకం కోసం రూ. 18వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో లక్ష ఇళ్లకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 40 వేల ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయయని తెలిపారు. రానున్న రెండు నెలల్లో మిగితా వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. దేశంలో ఎవరు చేయని సాహసం తెలంగాణ ప్రభుత్వం చేస్తోందన్నారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 50వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
వీటితో పాటు రానున్న కాలంలో మరిన్ని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన 7 ఇళ్లతో తెలంగాణ ప్రభుత్వం కట్టిన ఒక ఇళ్లుతో సమానమని చెప్పిన కేటీఆర్ ఇళ్ల మంజూరులో దళారులమాట నమ్మవద్దని చెప్పారు. లాటరీ ప్రకారం పారదర్శకంగా లబ్దిదారులకు ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు.
ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనుకాడబోమని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలతో పేద ప్రజలు లబ్దిపొందుతున్నారని చెప్పారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సాయం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ యావత్ దేశం దృష్టిని ఆకర్షించిందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఉపాధి హామీ,ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్‌లో నెంబర్ 1లో ఉన్నామని కేటీఆర్ వెల్లడించారు.