ప్రజల కనీస అవసరాలు తీర్చే బాధ్య ప్రభుత్వానిదేనని తెలిపారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నాగోల్‌లో మన నగరం కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ప్రజల చెంతకు పాలన తీసుకురావడానికే మన నగరం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో హైదరాబాద్‌ను స్వచ్ఛ నగరంగా మారుద్దామన్నారు.
గ్రేటర్ వాసులు కోరుకునే నాణ్యమైన జీవనం అందించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో 10 జోన్లు,50 డివిజన్లు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ అమోదంతో కొత్త జోన్లు,డివిజన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఇంకుడు గుంతలు నిర్మించుకున్న వారికి ఆస్తిపన్నులో 5 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. నీటి సంరక్షణ కోసం జలం-జీవం అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల సొమ్ముకు తాము ధర్మకర్తలం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన తడి, పొడి చెత్త బుట్టలను తప్పకుండా వినియోగించాలన్న కేటీఆర్… ఆదాయపన్ను సక్రమంగా చెల్లించాలని కోరారు.హరితహారంలో కూడా ప్రజల భాగస్వామ్యం పెరగాలన్నారు.
అంతకముందు జీహెచ్‌ఎంసీ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలపై రూపొందించిన పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. నగరంలోని అన్ని ప్రాంతాలకన్నా ఎల్బీనగర్ నియోజకవర్గంకు అధిక మొత్తంలో నిధులు కేటాయించడం పట్ల ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృష్ణయ్య కృతజ్ఞతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కృష్ణయ్య, తీగల కృష్ణరెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, మెట్రో ఎండీ ఎవీఎస్ రెడ్డి పాల్గొన్నారు.