సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప్రజా సమస్యలని ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ అందరిచే ప్రశంసలు అందుకుంటున్న మంత్రి కేటీఆర్ ఇయర్ ఎండింగ్ సందర్భంగా నెటిజన్స్ తో రెండు గంటల పాటు లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ,మంత్రి హరీష్‌లపై ప్రశంసలు గుప్పించారు. సీఎం కేసీఆర్ టాస్క్‌మాస్టర్ అని, మంత్రి హరీశ్‌రావు హార్డ్‌వర్కర్ అని కొనియాడారు .మంత్రి హరీశ్‌రావు మొండిపట్టుదల కలిగిన, కష్టపడి పనిచేసే నాయకుడని కితాబిచ్చారు.
కొత్త సంవత్సరంలో మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉండాలని తీర్మానించుకున్నానని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆరే కాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా తనకు ఎంతో ఇష్టమైన నాయకుడని చెప్పారు. 2018లో కాళేశ్వరం పూర్తవుతుంది కదా ఇది తెలంగాణకు పండుగ సంవత్సరం కదా అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ 2018 నిజంగా తెలంగాణకు పండుగ సంవత్సరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా అన్నిప్రాంతాలు, రంగాలను కలుపుకుంటూ సమ్మిళిత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నదని కేటీఆర్ పేర్కొన్నారు.
ఏపీలో ఎవరికి ఓటు వేస్తారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా… తనకు ఏపీలో ఓటు లేదని, అందువల్ల తన ఓటు టీడీపీకా లేక వైసీపీకా? అనే విషయాన్ని చెప్పలేనని సమాధానమిచ్చారు.పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌ను ప్రజలే నిర్ణయిస్తారని… దానిని డిసైడ్ చేయడానికి నేనెవరిని’ అంటూ సమాధానం ఇచ్చారు.
అమెరికాలో ఉన్నప్పుడు సొంతంగా వంట చేసుకునేవాడినని తెలిపారు. ఇండియన్, చైనీస్ వంటకాలు తనకు ఇష్టమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తమ సోదర రాష్ట్రమని అన్నారు. ఈ చాటింగ్‌లో టాలీవుడ్ హీరోల గురించి కూడా మాట్లాడడం విశేషం. కొందరు నెటిజన్స్ తమ హీరోలకి సంబంధించి ఒక్క మాటలో చెప్పాలని కేటీఆర్‌ని అడగగా .. జూనియర్ ఎన్టీఆర్‌ని ‘పెర్ఫామర్’, మహేష్‌బాబుని ‘స్ర్కీన్ ప్రజన్స్‌లో సూపర్‌స్టార్’, ప్రభాస్‌ని ‘బాహుబలి’ , పవన్ కల్యాణ్‌ని ‘ఎనిగ్మా’ అని అన్నారు కేటీఆర్. సమంత గురించి చెబుతూ.. మా తెలంగాణ చేనేతకి బ్రాండ్ అంబాసిడర్. నిజంగా సున్నితమైన మనస్కురాలు’ అంటూ కేటీఆర్ తనదైన స్టైల్‌లో నెటిజన్స్‌కి బదులిచ్చారు.