వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ సందర్బంగా హీరో సత్యదేవ్ మీడియాతో ‘కృష్ణమ్మ’ సినిమా గురించి ప్రత్యేకంగా ముచ్చటించారు.
కృష్ణమ్మ ఎలా మొదలైంది? మీరు ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?
ఈ సినిమా అందరూ ఓకే అయ్యాక నేను చివర్లో వచ్చాను. శివ గారికి నచ్చి ప్రజెంటర్ అయ్యారు. కాలభైరవ కూడా వచ్చారు. చివర్లో హీరోగా నేను వచ్చాను. డైరెక్టర్ గోపాలకృష్ణ నిర్మాత కృష్ణ గారికి కథ చెప్పి ఒప్పించారు. ఆ కథని కృష్ణ గారు శివ గారికి వినిపిస్తే నచ్చి ప్రజెంటర్ గా మారారు.
ట్రైలర్ చూశాక పోలీసులు, రౌడీలా మధ్య జరిగే కథ అని తెలుస్తుంది. కృష్ణ, విజయవాడ అంటే పాలిటిక్స్ ఇవన్నీ వినిపిస్తాయి కదా?
విజయవాడ అంటే పాలిటిక్స్, రౌడీయిజం అని చెప్తారు. కానీ అది కాదు అని చెప్పే కథే ఈ కృష్ణమ్మ. ఇది ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల కథ. వాళ్ళ చిన్న జీవితాలు, వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనుకునే ముగ్గురు ఫ్రెండ్స్. కానీ అలాంటి డ్రీమ్ చెడగొడితే వీళ్ళు ఏం చేశారు అనేదే ఉంటుంది. దీంట్లో రౌడీయిజం, పాలిటిక్స్ ఏం ఉండవు.
సినిమాలో ఎమోషన్స్ తో ప్రేక్షకులని ఎలా కనెక్ట్ చేస్తారు?
సినిమాలో హీరో చేసే పని నేను చేయాలి, అతన్ని కొట్టాలి అనిపిస్తే ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయినట్టే. ఈ సినిమా చూస్తుంటే ప్రేక్షకుడు అలాగే కనెక్ట్ అవుతాడు.
ట్రైలర్ లో యాక్షన్స్ చూపించారు, ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి చెప్తున్నారు. సినిమాలో రెండు ఎలా మేనేజ్ చేశారు?
కథ మెయిన్ లైఫ్ గురించే ఉంటుంది. కాకపోతే సందర్భానికి తగ్గట్టు, హీరో బాధ నుంచి వచ్చే రివెంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ వస్తాయి. అంతే కానీ కావాలని ఫైట్ సీన్స్ పెట్టలేదు ఎక్కడా కూడా.
సినిమా పాత్ర కోసం మీరు ఎలా కష్టపడ్డారు? ఇది రియల్ క్యారెక్టరా లేక ఫిక్షనల్ క్యారెక్టరా?
వించిపేట భద్ర అనే క్యారెక్టర్ కోసం, విజయవాడ స్లాంగ్ కోసం, ఆ బాడీ లాంగ్వేజ్ కోసం, కథలో కొన్నేళ్ల తర్వాత 40 ఏళ్ళ వ్యక్తిగా, పొగరు, పగ.. ఇలాంటివి అన్ని చూపించాలి కాబట్టి కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది డిఫరెంట్. ఇక ఇది రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల నుంచి తీసుకొని ఫిక్షనల్ గా రాసిన పాత్ర, కథ.
ట్రైలర్‌లో ఒక షాట్ లో మొక్కని నాటుతూ ఒకర్ని కొడతారు, ఆ షాట్ చాలా కొత్తగా ఉంది. ఆ సీన్ గురించి చెప్పండి?
సినిమాలో అది చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న సీన్. రివెంజ్ మర్చిపోతామేమో అని ఒక మొక్క పెంచుకుంటారు సినిమాలో. ఆ మొక్క ఎంత పెరిగితే పగ అంత పెరుగుతుంది. మొక్క నుంచి వృక్షం వరకు డైరెక్టర్ చాలా బాగా రాసాడు. అది సినిమాలో చూస్తేనే చాలా బాగుంటుంది. ఇలాంటి కొత్త సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి.
కొరటాల గారు స్క్రిప్ట్ లో ఏమైనా మార్పులు చెప్పారా?
లేదండి. నేనూ ఆశ్చర్యపోయాను. అంత పెద్ద డైరెక్టర్ స్క్రిప్ట్ లో ఎలాంటి ఛేంజ్ చెప్పకుండా ఆయనకు పూర్తిగా నచ్చి ప్రజెంటర్ గా వచ్చి సినిమాకు సపోర్ట్ చేశారు.
ఈ సినిమాలో చూపించిన మెయిన్ పాయింట్ డబ్బులు తీసుకొని శిక్షలు మీద వేసుకోవడం. గతంలో పలు సినిమాల్లో చూసాము, వాటికి కృష్ణమ్మకి తేడా ఏంటి?
గతంలో ఇలాంటి పాయింట్ మీద సినిమాలు వచ్చినా అవి సినిమాలో ఒక సీన్ లా ఉండేవి. కానీ ఇది కథ మొత్తం అదే పాయింట్ మీదే తిరుగుతుంది. అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్, జీవితం గురించి ఒక మంచి ఎమోషన్ ఉంటుంది.
సినిమాలో అథిరా రాజ్ గురించి, మిగిలిన పాత్రలు గురించి చెప్పండి.
ఈ సినిమాలో అథిరా ఒక్కరే మలయాళీ అమ్మాయి. మిగిలిన వాళ్లంతా తెలుగు వాళ్ళే. విజయవాడలో చేసాము కాబట్టి విజయవాడ నుంచి చాలా మంది ఆర్టిస్టులని తీసుకున్నాము. అథిరా మంచి ఎమోషన్ పండించింది. తెలుగమ్మాయిలా ఎమోషన్స్ చూపించింది. పోలీసాఫీసర్ నందగోపాల్ చాలా బాగా చేశారు. లక్ష్మణ్ మీసాల, కృష్ణ, అర్చన మిగిలిన పాత్రలు కూడా మంచి ఎమోషన్ పండించారు.
Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే
సినిమాలో మీ భద్ర క్యారెక్టర్ కేవలం రివెంజ్ ఉంటుందా లేదా లవ్, రొమాన్స్ కూడా ఉంటుంది?
అర్చన అనే అమ్మాయికి నాకు కథ ఉంటుంది. అలా అని లవ్, రొమాన్స్ కాదు ఒక చిన్న క్యూట్ కథ నడుస్తుంది. తన పాత్ర కూడా కథలో ఇంపార్టెంట్ గా ఉంటుంది.
సత్యదేవ్ అంటే కొత్త కథలు చేస్తారు? మీ కెరీర్ కి అవి ఎలా ఉపయోగపడ్డాయి?
నేను మొదట్నుంచి కొత్త కొత్త కథలే తీసుకుంటున్నాను కాబట్టే ఇక్కడ ఉన్నాను. నా దగరికి చాలా కథలు వస్తున్నాయి. అన్ని చేయలేకపోయినా నా వరకు కొత్తగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇందులో ఒక చిన్న క్రిమినల్ పాత్ర, తర్వాత ఒక క్రైం కామెడీ, ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ గా, ఇంకో సినిమాలో ఆటో డ్రైవర్ గా చేస్తున్నా.. ఇలా ప్రతి సినిమాకి వేరియేషన్ చూస్తాను.
గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేసారు. మళ్ళీ అలాంటి పాత్రలు చేస్తారా? వేరే పరిశ్రమల నుంచి అవకాశాలు వస్తున్నాయా?
గాడ్ ఫాదర్ లో చిరంజీవి గారికి ఆపోజిట్ గా చేశాను. రామసేతులో అక్షయ్ కుమార్ గారి పక్కన చేశాను. మళ్ళీ ఆ రేంజ్ పాత్రలు రాలేదు. అలాంటివి చాలా క్యారెక్టర్స్ అడిగారు కానీ ఆ పాత్రలకు కనీసం సమానంగా ఉండే పాత్రలు రాలేదు అందుకనే చేయాలట్లేదు. మంచి పాత్రలు వస్తే చేస్తాను. రామసేతు తర్వాత హిందీలో కూడా ఛాన్సులు వస్తున్నాయి కానీ మంచి పాత్ర కోసం చూస్తున్నాను. తమిళ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో చేస్తానేమో. ఇక వెబ్ సిరీస్ లు గతంలో గాడ్, లాక్డ్.. చేసాను, మళ్ళీ వస్తే కూడా చేస్తాను.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజమౌళి గారు ఈ సినిమా తర్వాత మీరు స్టార్ అవుతారని అన్నారు, మీకు ఈ సినిమా రిజల్ట్ పై ఏమనిపిస్తుంది?
ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎంత హిట్ అయి స్టార్ డమ్ వచ్చినా నేను ఇలాగే ఉంటాను. ఇలాగే సినిమాలు చేస్తూ ఉంటాను.
కాలభైరవ మ్యూజిక్ గురించి చెప్పండి..
ఈ సినిమా నుంచి బయటకి రాగానే ఫస్ట్ మాట్లాడేది కాల భైరవ గురించే మాట్లాడతారు. చాలా ఇంటెన్స్ ఉన్న సంగీతం ఇచ్చాడు. మా సినిమాకు కాలభైరవ చాలా ప్లస్ అయ్యాడు. నాకు బ్రదర్ లాంటివాడు కాలభైరవ. పాటలు కూడా చాలా బాగా ఇచ్చాడు.
నిర్మాత కృష్ణ గారి గురించి చెప్పండి..
సినిమా మీద ప్యాషన్ తోనే చేశారు. విజయవాడలో 60 రోజులు షూట్ చేసాము. కావాలంటే ఇక్కడ హైదరాబాద్ లో చేసేయొచ్చు. కానీ అక్కడ చేస్తేనే కథ ఇంకా బాగా కనిపిస్తుంది కాబట్టి ఆయన ఖర్చుకి వెనకాడకుండా విజయవాడలోనే షూట్ చేయడానికి సపోర్ట్ చేశారు. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పనిచేస్తారు.
మీ డ్రీమ్ రోల్?
నాయగన్ లాంటి సినిమా చేయాలి. కొత్త కొత్త గెటప్స్ వేసే పాత్ర చేయాలని ఉంది. చిరంజీవి గారి ఆపద్బాంధవుడు లాంటి సినిమా చేయాలి. చూడాలి మరి అలాంటి పాత్రలు వస్తాయేమో.
ఆల్ ది బెస్ట్ సత్యదేవ్ గారు..