కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం..

329
- Advertisement -

ఆదివారం కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం జరిగింది. ఆద్యంతం మల్లన్న శరణు నామస్మరణతో తన్మయత్వం దేవాలయం మారుమోగింది. ఈ కల్యాణోత్సవం మంత్రి హరీష్‌ రావు పాల్గొని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక శాసన సభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయ అభివృద్ది సంస్థ చైర్మన్ శ్రీఎర్రోల్ల శ్రీనివాస్,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అతి పెద్ద 50 టీఏంసీల సాగునీటి ప్రాజెక్టును మల్లన్న సాగర్ పేరిట పూర్తి చేసుకున్నట్లు, మల్లన్న దేవుడి దయతో ఆశీస్సులతో కొన్ని నెలల క్రితం 10 టీఏంసీల నీళ్లు నింపుకోవడం జరిగింది. సీఎం కేసీఆర్ భగవత్ భక్తుడు. రాష్ట్రంలో జరప తలపెట్టిన అన్నీ ప్రాజెక్టులకు, అన్నీ కార్యక్రమాలకు భగవంతుని పూజించి మొదలు పెడుతున్నాం, కాబట్టే ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు చేసి, అడ్డంకులు పెట్టిన, నిర్వాసితులను రెచ్చగొట్టి నిర్మాణ పనులు ఆపినా.. కొమురవెల్లి మల్లన్న దేవుడి దయతో సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేసుకుని, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నామన్నారు.

గతేడాది ప్రాజెక్టు పూర్తి కావాలని మల్లన్న దేవుడిని మొక్కుకుని వెళ్ళామని, మల్లన్న దేవుడి దయతో ప్రాజెక్టును పూర్తి చేసుకుని ఇప్పటికే 10 టీఏంసీల నీళ్లు తెచ్చుకున్నాం. కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి చేశామని, 7 ఏళ్లలో 30 కోట్ల రూపాయలతో కొమురవెల్లి ఆలయ అభివృద్ధి పనులు చేశామని మంత్రి అన్నారు. గతేడాది 3 వెండి దర్వాజలు చేస్తామని చెప్పి, పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ఇవాళ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొమురవెళ్లి మల్లన్న కోసం అద్భుతమైన బంగారు కిరీటం చేయించాలని సంకల్పించారని, వచ్చే యేడాది మల్లన్న కల్యాణోత్సవం వరకూ పూర్తి చేసి మల్లన్నకు బంగారు కిరీటం పెడతామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని, కరోనాతో బయట పడి ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని మల్లన్న దేవుడిని కోరడం జరిగిందని మంత్రి హరీష్‌ రావు తెలిపారు.

- Advertisement -