జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ రిప్లై

12
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాధానం ఇచ్చారు.  రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో విద్యుత్తు రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్తు రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్కు కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయేది. దీనివల్ల తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోవడం, దరిమిలా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అనే నానుడి తెలంగాణవ్యాప్తంగా వినిపించడం, పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలీడేలు ప్రకటించడం, దరిమిలా పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాలు చేయడం, గృహ అవసరాలకు కూడా అన్ని అపార్టుమెంట్లలో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, నగరాల్లో ఏ షాపుకు పోయినా జనరేటర్ల రొద వినిపించడం వంటి దృశ్యాలతో పాటు రాష్ట్రం మొత్తం జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు అన్నట్టుగా ఉండే విషయం మీకు తెలియనిది కాదు. నాడు తెలంగాణలోని గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే 3 ఫేజ్ విద్యుత్తు సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉండేది. ఇది కేవలం పల్లె సీమల పరిస్థితే కాదు. మండల కేంద్రాల్లో ఏకంగా 8 గంటల పాటు కరెంటు కోతలుండేవి. మున్సిపాలిటీల్లో 6 గంటల పాటు, రాజధాని హైదరాబాద్లోనూ ఏకంగా 4 గంటల పాటు పవర్ కట్ ఉండేది. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కరూ కరెంటు కోతల బాధితులే. చివరికి ఎవరైనా చనిపోతే, అంత్యక్రియల సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి నాటిది. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిందన్నారు.

ఈ పరిస్థితులను గమనించే నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్తు అవసరాల దృష్ట్యా, రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 సంవత్సరాల విద్యుత్తు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని, విభజన తర్వాత రెండు రాష్ట్రాలు విద్యుత్తును వినియోగించాల్సిన నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్కు 46.11 శాతం కేటాయించి, ఆవిధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్తును వినియోగించుకోవాలని నిర్దేశించింది. విభజన చట్ట ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఎంతమాత్రం సరిపోదు. అప్పటి (2014) వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపు 2,700 మెగావాట్ల కొరత ఉంది. మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ సరఫరాను ఎగవేయడం వల్ల 1,500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్తు రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి మరో 2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది. వెరసి మొత్తమ్మీద సుమారు 5,000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్తు రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దరిమిలా రాష్ట్రాన్ని విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కించడా నికిగాను, తెలంగాణకు శాశ్వతంగా ప్రయోజనాలు చేకూర్చే దిశగాను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఏకోన్ముఖంగా పనిచేసి, కఠోర పరిశ్రమ చేసి అద్భుతమైన విజయాలు సాధించాయి. అత్యంత అధ్వాన్న పరిస్థితిలో ఉన్న తెలంగాణ విద్యుత్తు పంపిణీ వ్యవస్థను పటిష్ఠపరచడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకుని విజయం సాధించడం, విద్యుదుత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడం ఇందుకు ఉదాహరణలు. తత్ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్తు, తర్వాత సుమారు 20,000 మెగావాట్ల పైచిలుకుకు చేరడం, అటు సరఫరా, పంపిణీ వ్యవస్థలు పటిష్ఠపడి సక్రమ విద్యుత్తు సరఫరా చేసే స్థాయికి ఎదగడం, తద్వారా మన భారతదేశంలోనే నాణ్యమైన నిరంతరాయ (24X7) కరెంటును అన్ని రంగాలకూ సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ వినుతికెక్కడం తమరికి తెలియని విషయం కాదు. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన నాడు తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 1,196 యూనిట్లు ఉండగా, పదేండ్ల కాలంలోనే అది 2,349 యూనిట్లకు పెరగడం, ఆ ఫలాలను మనమంతా అనుభవించడం మనందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పనిచేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విజయాలను ఆషామాషీగా సాధించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తు కొనుగోళ్ల విధానంలో కావచ్చు. లేదా రాష్ట్రంలో నూతన విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో కావచ్చు, అన్ని రకాల చట్టాలను, నిబంధనలను పాటిస్తూ, కేంద్ర, రాష్ట్ర అనుమతులను సాధిస్తూ, ముందుకు పోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ, వీటన్నింటికీ అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది, ముందుకు పురోగమించడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం ఏర్పడిన, న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎస్.ఇ.ఆర్.సి.)ల యొక్క తీర్పులకు లోబడే అన్ని చర్యలూ తీసుకోవడం జరిగింది. అట్టి చర్యలపై ఏదేని ఒక వ్యక్తికిగానీ, లేదా వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ అభ్యంతరాలు ఉన్న యెడల ఇ.ఆర్.సి.లు నిర్వహించే పబ్లిక్ హియరింగుల్లో తమ ఆక్షేపణలను తెలియజేయవచ్చు. ఏదేని విషయంపై వారి అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఇ.ఆర్.సి. తీర్పు వెలువడినచో వారు ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఆఫ్లైల్)కు అప్పీలు చేసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీ రేవంత్రెడ్డిగారు తెలంగాణ ఇ.ఆర్.సి.కి తన అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఆయన ఆక్షేపణలను పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే, తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఇ.ఆర్.సి. ఆమోదముద్ర వేయడం జరిగింది. అప్పటికీ శ్రీ రేవంత్రెడ్డిగారికి తెలంగాణ ఇ.ఆర్.సి. నిర్ణయాలపై అభ్యంతరాలో, ఆక్షేపణలో ఉండి ఉంటే, ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఆఫ్లైల్)కు వెళ్లే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టును కూడా సంప్రదించే స్వేచ్ఛను చట్టం ఆయనకు కల్పించింది. కానీ ఆయన ఆనాడు ఎలాంటి అప్పీలుకూ వెళ్లిన దాఖలాలు లేవు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా శ్రీ రేవంత్రెడ్డిగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. తదనంతరం శ్రీ రేవంత్రెడ్డిగారి ప్రభుత్వం, గొప్ప విద్యుత్తు విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగింది. వాటిమీద రాష్ట్ర శాసనసభలో చర్చోపచర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీలు చేయకూడదన్న ఎంక్వయిరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా శ్రీ రేవంత్రెడ్డిగారి ప్రభుత్వం కోల్పోయి ఒక ఎంక్వైరీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. అట్టి ఎంక్వైరీ కమిషన్ను మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం జరిగిందన్నారు.

హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు, న్యాయ ప్రాధికార సంస్థలైన ఇ.ఆర్.సి.లు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి, అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణనలోకి తీసుకోకుండానే 11.06.2024 నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి, పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ, నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నాను.థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో రెండు రకాలున్నాయి. 1. సబ్ క్రిటికల్. 2. సూపర్ క్రిటికల్. సబ్ క్రిటికల్ అనేది పాత టెక్నాలజీ కాగా, సూపర్ క్రిటికల్ అనేది దాని తర్వాత వచ్చినది. సబ్ క్రిటికల్ కంటే సూపర్ క్రిటికల్ వల్ల కాలుష్యం తక్కువ. అయితే సబ్ క్రిటికల్ కన్నా సూపర్ క్రిటికల్ ప్లాంట్ నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. తెలంగాణ కొత్త విద్యుత్తు కేంద్రాల నిర్మాణం ప్రారంభించే 2014 నాటికి భారత దేశంలో సుమారు 90శాతం థర్మల్ విద్యుత్కేంద్రాలు సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మాణమైనవే. కొత్తగూడెంలో ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంటు (కేటీపీఎస్ – 1720 మెగావాట్లు), భూపాల్పల్లిలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ- 500 మెగావాట్లు), రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంటు (ఆర్టీపీసీ – 62 మెగావాట్లు), ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ థర్మల్ పవర్ ప్లాంటు (వీటీపీఎస్ – 1760 మెగావాట్లు) ఇవన్నీ సబ్ క్రిటికల్ పద్ధతిలో నిర్మాణమైనవే. వెరసి దేశంలోనూ, ఎన్టీపీసీ పరిధిలోనూ 90 శాతం థర్మల్ ప్లాంట్లు సబ్ క్రిటికలే కాగా, ఒకటి రెండు మాత్రమే…సూపర్ క్రిటికల్ విద్యుత్కేంద్రాలున్నాయి. సూపర్ క్రిటికల్ పరిజ్ఞానం కింద నిర్మాణాలు అప్పుడప్పుడే మొదలవుతున్నయి. కాలుష్య నియంత్రణలో భాగంగా, క్లీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం, 2015లో కుదిరిన పారిస్ ఒప్పందంలో భారత్ చేరిన పర్యవసానంగా దేశంలో సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రాలను ప్రోత్సహించాలనే ఆలోచన వచ్చింది. ఈ బ్యాక్ గ్రౌండ్లో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణలో విద్యుత్తు కొరతను తీర్చడానికి ఒకవైపు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటూనే, మరోవైపు విద్యుదుత్పత్తిలో స్వావలంబన సాధించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా వీలైనంత వేగంగా కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించబడింది. అప్పటికి దేశంలో భారీ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంలో పేరెన్నిక గన్న సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఎల్). కేంద్ర ప్రభుత్వ రంగ విభాగం అయిన ఇది నవరత్నాల్లో ఒకటి. బీహెచ్ఎల్కున్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా, తెలంగాణలో కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణానికి దాన్ని సంప్రదించడం జరిగింది. ‘మా రాష్ట్రానికి విద్యుత్తు అవసరం చాలా ఎక్కువగా ఉంది. సత్వరమే విదుత్కేంద్రాల నిర్మాణం జరగాల్సి ఉంది. మీరు చేయగలరా ?’ అని ఆరా తీయడం జరిగింది. దానికి బీహెచ్ఎల్ వారు… ‘మా వద్ద సబ్ క్రిటికల్ విద్యుత్కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి సిద్ధంగా ఉంది. మీకు అత్యవసరం ఉంది కనుక దాంతో రెండేండ్లలోనే మీకు మణుగూరులో 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్హెంటు నిర్మించి ఇవ్వగలం. కొత్తగూడెంలో ప్రతిపాదించిన 800 మెగావాట్ల ఏడో దశను మాత్రం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ప్లాంటును నాలుగేండ్లలో ఇవ్వగలం’ అని జవాబిచ్చారు. దీంతో అప్పుడు తెలంగాణలో ఉన్న తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, సత్వరమే కరెంటును అందుబాటులోకి తెచ్చుకోవడం కోసం మణుగూరులో సబ్ క్రిటికల్ పద్ధతిలో థర్మల్ ప్లాంటు నిర్మాణానికి శ్రీకారం చుట్టబడింది.

Also Read:Harishrao:కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం

అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కరెంటు విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి అసాధారణ సంక్షోభంలోనే ఉంది. అదీగాక 2014 నాటికి సబ్ క్రిటికల్పై ఎలాంటి నిషేధంగానీ, నియంత్రణగానీ లేదు. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళిక కూడా, సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు నిర్మించుకోవచ్చని పేర్కొంది. అయితే మీరు 11-6-24 రోజున నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేను పైన తెలిపిన ఏ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్పై విపరీత వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించిన నాటికి మన రాష్ట్రంతో పాటు యావత్తు దేశవిద్యుత్తు రంగమే 90 శాతం సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ల విద్యుత్తు ఉత్పత్తిపైనే ఆధారపడి ఉందన్న సంగతిని మీరు పూర్తిగా విస్మరించారు. ఒకవైపు దేశంలో 90 శాతం సబ్ క్రిటికల్ ప్లాంట్లే ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే సబ్ క్రిటకల్ ప్లాంట్ పెట్టినట్టు చేయరాని తప్పు ఏదో చేసినట్టు మీరు మాట్లాడిన తీరు దురుద్దేశాన్ని బయటపెట్టింది. 2017 వరకు అమల్లో ఉండే 12వ పంచవర్ష ప్రణాళికలో కూడా సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని మీరు విస్మరించారు. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అవసరమైన అన్ని చట్టబద్ధ సంస్థల నుంచి అనుమతులు, ఆమోదాలు పొందిన తర్వాతనే భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ పని ప్రారంభించి, విజయవంతంగా నిర్మాణం పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేసిన సంగతినీ మీరు విస్మరించడమే కాకుండా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎదో తప్పుచేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారు. అందువల్ల మీరు ఈ అంశాన్ని విచారించే విచారణార్హతను కోల్పోయారు. కాబట్టి మీరు మీ బాధ్యతలనుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.

భద్రాద్రిలో సబ్ క్రిటికల్ ప్లాంట్ వల్ల కలిగే అదనపు బొగ్గు భారాన్ని తెలంగాణ జన్కోలోని నెగోషియేషన్స్ కమిటీ, వాళ్లు అవలంబించే ఫార్ములా ద్వారా అంచనా వేసి, బి.హెచ్.ఈ.ఎల్తో సంప్రదింపులు జరిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ. 400 కోట్లను తగ్గించారు. అందుకు బి.హెచ్.ఈ.ఎల్. అంగీకరించిన తర్వాతనే భద్రాద్రి ప్లాంట్ పనులు ప్రారంభించబడ్డాయి. ఈ వాస్తవాన్ని మీరు విస్మరించి మీకై మీరే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి, సబ్ క్రిటికల్ ప్లాంటు.. తద్వారా రాష్ట్రానికి ఏదో భారీ నష్టం వాటిల్లిందనన్నట్టుగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. మీరు చేసిన ఈ వ్యాఖ్యలు అసమంజసం కనీస పరిజ్ఞానం ఉన్న ఎవరూ కూడా వాటిని అంగీకరించరు. ఈ కారణం చేత కూడా మీరు విచారణార్హతను కోల్పోయినందువల్ల ఈ బాధ్యత నుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే దశలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్తు లోటుతో ఉందన్నది అందరికి తెలిసిందే. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రజల అవసరాలు తీర్చడానికి, పీక్ లోడ్ లాంటి అత్యవసర పరిస్థితులను అధిగమించడానికి, తెలంగాణ విద్యుత్తు సంస్థలు గత్యంతరంలేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజిల ద్వారా కరెంటు కొనుగోలు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. అదే సమయంలో బి.హెచ్.ఈ.ఎల్. ముందుకొచ్చి కేవలం రెండేళ్లలోనే ప్లాంట్ సిద్ధం చేస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిన దరిమిలా అధిక ధరల భారం రాష్ట్రం మీద పడకుండా ఉండడానికి బి.హెచ్.ఈ.ఎల్.కు నామినేషన్ పద్ధతిలో భద్రాద్రి పనులను అప్పగించడం జరిగింది. దీంతోపాటు మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. తెలంగాణ ఉద్యమ సమయం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం మా పార్టీ పాలసీ కాబట్టి, బి.హెచ్.ఈ.ఎల్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి, ఆ సంస్థకు నామినేషన్ పద్ధతిపై పనులు ఇవ్వడం జరిగింది.విలేఖరుల సమావేశంలో మీరు చెప్పినట్టుగానే బి.హెచ్.ఇ.ఎల్ రెండు సంవత్సరాల్లోనే ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వడం వల్ల వారికి పనులు అప్పగించడం జరిగింది. అయితే మీరు చేసిన వ్యాఖ్యల్లో, సత్వరం అవుతుందని ఇచ్చారు గానీ, అనుకున్నంత వేగంగా అది పూర్తి కాలేదన్నట్టు, దానికి కూడా ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు మీరు మాట్లాడారు. ఇలా మాట్లాడేటప్పుడు భద్రాద్రి మీద ఎన్.జి.టి. విధించిన స్టే ఆర్డరుగానీ, కరోనా మహమ్మారి వల్ల కలిగిన అంతరాయాన్ని గానీ మీరు పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం.2014లో రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎంతటి తీవ్ర కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొన్నదో నేను మీకు ముందే వివరించాను. అప్పటికి తెలంగాణ నేషనల్ గ్రిడ్ కనెక్ట్ కాకుండా, కేవలం దక్షిణ గ్రిడ్లోనే ఉంది. దీంతో ఈ కరెంటు లోటును పూడ్చుకోవడానికి దక్షణాదిలో ఎక్కడైన విద్యుత్తు అందుబాటులో ఉందా
పరిశీలించాలని అప్పటి మా ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ఆదేశించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కరెంటు అందుబాటులో లేదని వారి అధ్యయనంలో తేలింది. దీంతో ఇతర గ్రిడ్లలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా విద్యుత్తు అందుబాటులో ఉందా అన్నది పరిశీలించాల్సిందిగా అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. మనకు పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్లో మిగులు విద్యుత్తు ఉన్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తీసుకొనే సాధ్యాసాధ్యాలపై ఆ రాష్ట్రంతో తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్తు సంస్థల అధికారులు సంప్రదింపులు జరిపారు. రెండు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చపోచర్చల అనంతరం ఛత్తీస్గఢ్ మొదట 1000 మెగావాట్లు భవిష్యత్తులో అవసరమైతే మరో 1000 మెగావాట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ తర్వాత 3-11-2014 తేదీనాడు రాయ్పూర్లో జరిగిన సమావేశంలో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ 1000 మెగావాట్ల కరెంటు కొనుగోలు చేసేందుకు ఎంవోయూ (అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ సమయంలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరో 1000 మెగావాట్లు సమకూర్చడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మరోసారి సుముఖత వ్యక్తం చేసిందన్నారు.

అయితే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్లు లేవు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పి.జి.సి.ఐ.ఎల్.) మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్పిల్లి వరకు లైన్ నిర్మాణం ప్రారంభించింది. దాని ద్వారా ఛత్తీస్గఢ్ కరెంట్ తెలంగాణకు తీసుకువచ్చే వీలుందని తెలుసుకున్న అప్పటి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులు పి.జి.సి.ఐ.ఎల్.తో సంప్రదింపులు జరిపారు. ఆ లైన్ నిర్మాణం సత్వరం పూర్తి కావడానికి భూ సేకరణ మొదలైన అంశాల్లో సహాయ సహకారాలు అందజేశారు. అప్పటికే సమయంలో పి.జి.సి.ఐ.ఎల్ నిర్మిస్తున్న ఈ లైన్లో దక్షిణాది రాష్ట్రాలు పోటా పోటీగా కారిడార్ బుక్చేయడం మొదలైంది. లైన్ నిర్మాణం పూర్తి కాకున్నా ఇతర రాష్ట్రాలు చేస్తున్నాయి కనుక తప్పని సరి పరిస్థితుల్లో తెలంగాణ కూడా కారిడార్ బుక్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్తును తీసుకురావాలంటే డెడికేటెడ్ కారిడార్ అత్యవసరం. తెలంగాణకు కారిడార్ అవసరం అనుకుంటే ముందే తమతో (లైన్ ట్రాన్సిమిషన్ అగ్రిమెంట్- ఎల్.టి.ఏ) ఒప్పందం చేసుకోవాలని, ఎల్.టి.ఏ లేకుండా డిడికేటెడ్ లైన్ కేటాయించలేమని స్పష్టం చేస్తూ పి.జి.సి.ఐ.ఎల్. 8-6-2016న తెలంగాణకు ఒక లేఖ రాసింది. (C/CTU PLG/LTA/S/2016/TSSPDCL రిఫరెన్స్తో పి.జి.సి.ఐ.ఎల్. రాసిన లేఖను మీ పరిశీలన కోసం జత పరుస్తున్నాను.) అయితే డెడికేటెడ్ లైన్ కోసం ఒప్పందం చేసుకోవాలంటే పి.జి.సి.ఐ.ఎల్. విధించే షరతుల ప్రకారం మనం ఎవరి నుంచి విద్యుత్తు కొనుగోలు చేస్తున్నామో వివరంగా పేర్కొని వారితో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పి.పి.ఎ) ప్రతిని కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంటే మనం విద్యుత్ కొనే సంస్థతో పి.పి.ఎ. చేసుకుంటే తప్ప పి.జి.సి.ఐ.ఎల్తో ఎల్.టి.ఎ. చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టమవుతున్నది. పి.జి.సి.ఐ.ఎల్ విధించే మరొక నిబంధన ఏమిటంటే కారిడార్ బుక్ చేయడానికి అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే పద్ధతిని పాటిస్తుంది. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇదే (వార్ధా – డిచ్పల్లి) లైన్ మీద వేగంగా ఎల్.టి.ఎ.లు చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించడం, ఒక సారి లైన్ నిర్మాణం పూర్తయితే ఆన్లైన్ (ఓపెన్ మార్కెట్) విద్యుత్తు కొనుగోలు దారులు ఒత్తిడి పెంచే అవకాశం ఉండటం వల్ల, తెలంగాణ ప్రభుత్వం డెడికేటెడ్ కారిడార్ బుక్చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆనాడు అత్యంత తీవ్ర కరెంటు సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను దాన్నుంచి బయటపడేయాలంటే, ఛత్తీస్గఢ్ విద్యుత్తు సంస్థలతో పి.పి.ఎ. చేసుకోవడం, ఆ పి.పి.ఎ.ను సమర్పించి పి.జి.సి.ఐ.ఎల్ వద్ద కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్తు సంస్థలకు మరో మార్గం లేకపోయిందన్నారు.

పి.పి.ఎ. కుదుర్చుకునే సందర్భంలోనే తాము మార్వా విద్యుత్తు కేంద్రం నుంచి కరెంటు ఇస్తామని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పడం, దాని నిర్మాణం కూడా ముగింపు దశలో ఉండడం, ఇంచుమించు అదే సమయానికి పి.జి.సి.ఐ.ఎల్. లైన్ కూడా పూర్తయ్యే అవకాశం ఉండటంతో మార్వా విద్యుత్తు కొనుగోలుకు పి.పి.ఎ. చేసుకోవడం జరిగింది. అయితే 11-6-2024 నాడు మీరు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, పైన నేను పేర్కొన్న అంశాలేవీ ప్రస్తావించకుండా, పరిగణనలోకి తీసుకోకుండా మార్వా నుంచి విద్యుత్తు కొనుగోలు వ్యవహారాన్ని తప్పుబట్టే విధంగా, మార్వా పవర్ ప్లాంటే ఎగ్జిస్టెన్స్లో లేదన్నట్టు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఛత్తీస్గఢ్ చేసుకున్న ఎం.ఓ.యు.లోనే అప్కమింగ్ మార్వా ప్రాజెక్టు అని స్పష్టంగా ఉన్నది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పి.పి.ఎ.)లు అన్నీ ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించి మీరు మాట్లాడటం అత్యంత దురదృష్టకరం.ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఆ రాష్ట్ర విద్యుత్తు సంస్థలతో కుదిరిన పి.పి.ఎ. ఆధారంగా పి.జి.సి.ఐ.ఎల్.తో 2000 మెగావాట్ల కారిడార్ను బుక్ చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు సరఫరా ప్రారంభమైన తర్వాత 1000 మెగావాట్ల కారిడారు ఉపయోగించుకోవడం జరిగింది. మిగితా 1000 మెగావాట్లకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ఆశించిన మేరకు కరెంటు సరఫరా కాకపోవడంతో రెండో 1000 మెగావాట్ల కారిడార్ను రద్దుచేసుకోవడం జరిగింది. ఈ క్యాన్సలేషన్ వల్ల తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ఎలాంటి ఆర్థిక నష్టమూ వాటిల్లలేదు.తెలంగాణలో ఉన్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఆ సందర్భంలో రాష్ట్ర ప్రజలు పడుతున్న అవస్థలను పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందించాల్సింది పోయి మీరు విమర్శలు చేయడాన్ని నేను దురదృష్టకరంగా భావిస్తున్నాను. అప్పుడు తెలంగాణ తీవ్ర విద్యుత్తు సంక్షోభంలో ఉండటం, తెలంగాణకు ఒక వనరుగా ఉన్న సీలేరు విద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ గుంజుకుపోవడం, ఆంధ్రప్రదేశ్ నుంచి మన వాటాగా రావాల్సిన విద్యుత్తు కూడా రాకపోవడం, ప్రైవేటు విద్యుత్తు కేంద్రాల నుంచి తెలంగాణ వాటా తెలంగాణకు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పి.పి.ఎలను రద్దు చేయడం, మరోవైపు కొనుక్కునేందుకు కూడా దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడా కరెంటు లభ్యత లేకపోవడం, వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఛత్తీస్గఢ్ రాష్ట్ర విద్యుత్తు పి.ఎస్.యుల నుంచి సంప్రదింపుల ద్వారా విద్యుత్తు కొనుగోలు చేయాలని అప్పటి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఈ నిర్ణయం తర్వాత కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం, మరో రాష్ట్ర ప్రభుత్వంతో ఎం.ఒ.యు.చేసుకోవడం, ఆ తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థలు, మరో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థలతో పి.పి.ఎ. చేసుకోవడం, ఆ పి.పి.ఎల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పి.జి.సి.ఐ.ఎల్తో డెడికేటెట్ కారిడార్ కోసం ఒప్పందం (ఎల్.టి.ఎ) చేసుకోవడం జరిగింది. పి.పి.ఎగానీ, ఎల్.టి.ఎ గానీ అన్నీ ప్రభుత్వ సంస్థల మధ్యనే కాబట్టి ఒప్పందాలు పూర్తి పారదర్శకతతో ఉంటాయనే ఉద్దేశంతో సంప్రదింపుల ద్వారా విద్యుత్తు కొనుగోలు చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అధికారిక ప్రక్రియను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్రాల విద్యుత్తు సంస్థలు నిర్వహించినప్పటికీ, దానిని రెండు రాష్ట్రాల ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఇ.ఆర్.సి)లు పారదర్శకంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించి మరీ ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి సంప్రదింపుల పద్ధతిలో విద్యుత్తు కొనుగోలు చేయడం జరిగింది. తదనంతరం పి.పి.ఎలను రెండు రాష్ట్రాల ఇ.ఆర్.సి.ల ముందు ప్రతిపాదించడం, ఉభయ రాష్ట్రాల ఇ.ఆర్.సి.లు ఆ ప్రతిపాదనలను ఆమోదించడం జరిగింది. న్యాయ ప్రాధికార సంస్థలైన ఉభయ రాష్ట్రాల ఇ.ఆర్.సి.లు అన్ని రకాల పరిశీలనలు జరిపి ఇచ్చిన ఆమోదాలపై తిరిగి ఎంక్వయిరీ జరపాలన్న ఆలోచనే దురదృష్టకరం. ఇ.ఆర్.సిలకు సంబంధించిన విషయమై విలేఖరుల సమావేశంలో మీరు ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్.ఇ.ఆర్.సి. పరిశీలించకూడదని, ఆ అధికారం కేంద్ర ఇ.ఆర్.సి.కి మాత్రమే ఉందని, ఇందులో ఏదో తప్పు జరిగిందనే భావన కలిగేలా వ్యాఖ్యానించారు. కానీ, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లోని సెక్షన్ -64(5) ప్రకారం ఈ అంశం (రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు క్రయవిక్రయాల)పై అధికారం కేవలం రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లకే ఉన్నదని స్పష్టమవుతున్నది. దాన్ని అనుసరించే ఉభయరాష్ట్రాల ఇ.ఆర్.సిలూ వ్యవహరించి తమ తీర్పులను వెలువరించారు. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరచబడి ఉన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై కూడా ఇలా వ్యాఖ్యానాలు చేయడం విచారకరం. దీన్నిబట్టి చూస్తే కూడా ఈ వ్యవహారంపై విచారణార్హతను మీరు కోల్పోయినట్టు స్పష్టమవుతున్నది కనుక, మీరు ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు.

ఛత్తీస్గఢ్ తెలంగాణ పీపీఏ చేసుకున్న 2014 సంవత్సరంలోనే తమిళనాడు టెండర్ పద్ధతిలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. దాని యూనిట్ రేటు రూ.4.94. అదే సంవత్సరం కర్ణాటక కూడా టెండర్ పద్ధతిలో పీపీఏ చేసుకున్నది. యూనిట్ రేటు రూ.4.33. ఎన్టీపీసీ సింహాద్రి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నామినేషన్ పద్ధతిలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం జరిగింది. కాగా మనం ఛత్తీస్గఢ్ నామినేషన్ పద్ధతిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రూ. 3.90కే యూనిట్ కరెంటు కొంటే అది ఎక్కువ కాస్ట్ ఎట్లా అవుతుంది? అలాంటప్పుడు తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు. ఈ దృష్ట్యా కూడా మీరు ఈ వ్యవహారం పై విచారణ జరిపే అర్హత కోల్పోయారు. అందువల్ల స్వచ్చందంగా విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని దామరచెర్లలోనే ఎందుకు పెట్టాల్సివచ్చింది అన్నది మీ విచారణాంశాల్లో ఉన్నది. ఒకటి.. ఒక విద్యుత్కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం. అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో స్థలాన్ని ఎంపిక చేస్తుంది. తెలంగాణలో ప్రధాన విద్యుత్కేంద్రాలన్నీ గోదావరి నది ఒడ్డునే ఉన్నాయి. కొత్తగూడెంలోని కె.టి.పి.ఎస్. గానీ, జైపూర్ లోని సింగరేణి ప్లాంట్ గానీ, రామగుండం ఎన్.టి.పి.సి.గానీ, విభజన చట్టం మేరకు కేంద్రం పెడుతున్న మరో భారీ ఎన్.టి.పి.సి ప్లాంటుగానీ, భూపాలపల్లిలోని కాకతీయ ప్లాంటుగానీ, తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన భద్రాద్రి ప్లాంటుగానీ అన్నీ గోదావరి నదీ తీరంలోనే ఉన్నాయి. తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఉన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్కేంద్రం కూడా లేదు. విద్యుత్కేంద్ర నిర్మాణం అంటే అది కేవలం విద్యుదుత్పత్తికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. ప్లాంటు నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఎంతో పెరుగుతుంది. ఆర్థికంగా ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎన్టీపీసీ ప్లాంటు కారణంగా రామగుండం ఎట్లా అభివృద్ధి చెందిందో మనందరం మన కండ్లతో చూస్తున్నం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాంతీయ సమతుల్యతను సాధించడం అనేది ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం వెనకబడ్డ నల్లగొండ జిల్లాలోని దామరచర్లను ఉద్దేశపూర్వకంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ఎంపిక చేసింది. దామరచర్లలో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం నిర్మించిన 4000 మెగావాట్ల ప్లాంటుతో పాటు, భవిష్యత్తులో దాని విస్తరణకు కూడా అక్కడ అవకాశం ఉన్నది. సోలార్ పవర్ ప్లాంటు పెట్టుకోవడానికి కూడా దామరచర్లలో వెసులుబాటు ఉందన్నారు.

దామరచర్లను ఎంపిక చేయడానికి మరికొన్ని వ్యూహాత్మక కారణాలూ ఉన్నాయి. నేటి ఆధునిక జీవితంలో కరెంటు అన్నది అత్యవసరం. ఒక ప్రాంతంలో తీవ్రవాద సమస్యగానీ, ప్రకృతి విపత్తుగానీ తలెత్తి ఇబ్బంది ఏర్పడితే, దాని తీవ్రతను మినిమైజ్ చేసేలా మరో ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించుకోవడం అనేది ఏ ప్రభుత్వమైనా ముందుచూపుతో చేసే పని. తెలంగాణలోని భారీ విద్యుత్కేంద్రాలన్నీ గోదావరి తీరంలోనే ఉన్నందున తెలంగాణ దక్షిణ ప్రాంతానికి అనువుగా, యాదాద్రి ప్లాంటు నిర్మాణానికి దామరచర్లను ఎంపిక చేసాం. అప్పో సప్పో చేసి థర్మల్ పవర్ ప్లాంటుని మనం నిర్మించుకోగలం. కానీ దానికి బొగ్గు కేటాయించాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే. సింగరేణి బొగ్గు గనులు తెలంగాణలోనే ఉన్నా ఆ బొగ్గును కేటాయించేది మాత్రమే కేంద్ర ప్రభుత్వమే. థర్మల్ కేంద్రాలకు బొగ్గే ప్రధాన ఇంధనం. ఒకవేళ ఏదేని కారణం వల్ల దేశంలో బొగ్గు కొరత ఏర్పడినా, కేంద్రం కేటాయించకపోయినా, ఆ కారణంగా రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. బొగ్గు గనుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతున్న సందర్భాలను మనం ఇటీవల గమనిస్తూనే ఉన్నాం. వీటన్నింటి దృష్ట్యా వ్యూహాత్మకంగా దామరచర్లను ఎంపిక చేయడం జరిగింది. దామరచర్లకు సమీపంలో కృష్ణపట్నం, బందరు (మచిలీపట్నం) రేవులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఈ పోర్టుల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. అదీగాక దామరచర్ల అటు నేషనల్ హైవేకు, ఇటు రైల్వే లైను సమీపంలోనే ఉన్నది. అందువల్ల రవాణాకు సంబంధించిన సమస్యలుండవు. కృష్ణానది తీరంలో ఉన్న దామరచర్లకు అటు నాగార్జున సాగర్ నుంచి, ఇటు టెయిలాండ్ నుంచి కావాల్సినన్ని నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి.థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి భారీగా ఫ్లైయాష్ వెలువడుతుంది. దామరచర్లలో నిర్మించేది 4000 మెగావాట్ల భారీ థర్మల్ ప్లాంటు కనుక దీన్నుంచి పెద్దమొత్తంలో ఫ్లైయాష్ వెలువడుతుంది. దాన్ని ఎక్కడా పెట్టుకోలేం. పారేయలేం. ప్లాంటు నుంచి ఇది వెంటవెంటనే బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఫ్లైయాష్ను వాడుకునేది ప్రధానంగా సిమెంటు పరిశ్రమలు. ఇవి దామరచర్ల సమీపంలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్లాంటు నుంచి వచ్చే ఫ్లెయాష్ను వాడుకుంటామని అవి ప్రభుత్వానికి లిఖిత పూర్వక హామీ కూడా ఇచ్చాయి. ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి దామరచర్లను ఎంపికచేయడం జరిగిందన్నారు.

దామరచెర్లలో ప్లాంట్ నిర్మాణం ప్రారంభించిన నాడు దేశంలో లభించే బొగ్గుతోనే దాన్ని నడపాలని అనుకున్నాం. భవిష్యత్తులో ఒకవేళ దేశంలో బొగ్గు దొరకకున్నా, కొరత ఏర్పడినా దిగుమతి చేసుకునే విదేశీ బొగ్గుతో నడుపవచ్చని భావించాం. కానీ, తదనంతర ప్రయత్నాల వల్ల మన దేశంలో లభించే బొగ్గునే కేంద్ర ప్రభుత్వం కేటాయించటం మనందరం హర్షించదగ్గ విషయం. మీ పరిశీలనార్థం ఉన్న విషయాల్లో కోల్ లింకేజీతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా ఉన్నది. బొగ్గు రవాణా వ్యయమే ప్రాతిపదిక అనుకుంటే రాయలసీమ ప్రాంతంలోని ముద్దనూరు పవర్ ప్లాంట్ (ఆర్.టి.పి.పి)ని బొగ్గు గనులకు 580 కిలోమీటర్ల దూరంలో ఎందుకు నిర్మించినట్టు? సింగరేణి గనులకు సుదూరంగానూ మరియు తాల్చేరు బొగ్గు గనులకు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడలో థర్మల్ ప్లాంట్ను (వి.టి.పి.ఎస్) ఎందుకు పెట్టినట్టు. బొగ్గు గనులకు ఎంతో దూరంగా ఉన్నప్పటికీ, హర్యానాలోని జజ్జర్ , పంజాబ్లోని గోవింద్వాలా సాహెబ్, కర్ణాటకలోని రాయచూర్ (శక్తినగర్)లో, బళ్లారిలో, తమిళనాడులోని మెట్టూరులో థర్మల్ ప్లాంట్లు ఎందుకు పెట్టినట్టు? థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ లాసెస్ని తగ్గించడం, విపత్తుల నివారణ (డీ రిస్కింగ్) అనేవి కూడా ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయన్న వాస్తవాన్ని మీరు విస్మరించడం ఎంతో దురదృష్టకరం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును నామినేషన్ పద్ధతిపై బి.హెచ్.ఇ.ఎల్కు ఇవ్వడంపై కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. థర్మల్ అయినా, హైడ్రో అయినా, న్యూక్లియర్ అయినా, భారీ విద్యుత్కేంద్రాల నిర్మాణానికి మన దేశంలో ఉన్నది బీహెచ్ ఈఎల్ ఒక్కటే. ఇటీవల తోషిబా, హిటాచి వంటి కొన్ని అంతర్జాతీయ ప్రైవేటు సంస్థలు సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చినప్పటికీ, ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. విద్యుత్కేంద్ర నిర్మాణాన్ని ఒక ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగిస్తున్నప్పుడు, దాన్ని నామినేషన్ పద్ధతిలో అయినా చేయవచ్చు, టెండర్ పద్ధతిలో అయినా చేయవచ్చు. అది చట్టబద్ధమే! నిజం ఏమిటంటే దేశంలోని అనేక కేంద్ర సంస్థలు, జెన్కోల వంటి రాష్ట్ర సంస్థలు, ఎన్.టి.పి.సి., చివరికి ప్రైవేటు కంపెనీలు కూడా నామినేషన్ పద్ధతిపై బి.హెచ్.ఇ.ఎల్కు పనులు అప్పగించాయి. (మీ అవగాహన కోసం వాటి జాబితాను మీకు పంపిస్తున్నాను.) ఇవేవీ పరిశీలించకుండా ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే బి.హెచ్.ఇ.ఎలు నామినేషన్ పద్ధతిపై పనులు అప్పగించినట్టు మీరు మాట్లాడారన్నారు.పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Also Read:Roja:మంచి చేసి ఓడిపోయాం

- Advertisement -