ఎస్సారెస్పీ పున‌రుజ్జీవనకు శంకుస్థాపన

311
KCR launches SRSP works
- Advertisement -

రాష్ట్ర సాగునీటి చరిత్రలో సరి కొత్త అధ్యాయం లిఖితమైంది. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి సంకల్పించిన ప్రభుత్వం ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి శ్రీకారం చుట్టింది. పోచంపాడు లో ఎస్సారెస్పీ పున‌రుజ్జీవ ప‌థ‌కానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. మట్టి త‌వ్వి ప‌థ‌కానికి ప‌నులు ప్రారంభించిన సీఎం …. వ‌ర‌ద కాలువ ద‌గ్గ‌ర ఉన్న పైలాన్ ను  ఆవిష్క‌రించారు.

వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండానే ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా ఎస్సారెస్పీ  మారనుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తరచు తలెత్తుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం పేరిట.. ప్రాజెక్టుకు పూర్వవైభవం తెచ్చేందుకు సంకల్పించింది. ప్రాజెక్టుతో పాటు.. దీనికిందనున్న కాలువల ఆధునికీకరణ పనులనూ ప్రభుత్వం చేపడుతోంది.ఈ పథకం ద్వారా కాళేశ్వరం నుంచి 60 టీఎంసీల నీటిని శ్రీరాంసాగర్‌కు తరలిస్తారు.

KCR launches SRSP works

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి నుంచి 2 దశల్లో మిడ్ మానేరుకు నీరు తీసుకువచ్చే పనులు వేగంగా జరుగుతున్నాయి. రోజుకు రెండు టిఎంసిల నీటిని ఎల్లంపల్లి నుంచి తరలించే అవకాశం ఉండగా, అందులో ఒక టిఎంసిని వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు మళ్లిస్తారు. మరో టిఎంసిని వరద కాలువపైనే చిన్న చిన్న హెడ్ రెగ్యులేటర్లు కట్టి, రివర్స్‌లో శ్రీరాంసాగర్‌కు మళ్లిస్తారు.

60 రోజుల్లో 60 టిఎంసిల నీటిని ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించారు. గోదావరి నదిలో ప్రాణహిత సంగమ స్థానానికి కొద్దిదూరంలో మేడిగడ్డ వద్ద ప్రభుత్వం బ్యారేజిని నియమిస్తోంది. రీడిజైనింగ్‌లో భాగంగా మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలిస్తారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు, శ్రీరాంసాగర్‌కు నీటిని తరలిస్తారు.

కాకతీయ కెనాల్ 116 కిలోమీటర్ల మేర పారుతూ 1.78 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది.చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల ద్వారా 36 వేల ఎకరాలు సాగవుతుంది. సరస్వతి కెనాల్ కింద 36 వేల ఎకరాలు, ఐడిసి ఎత్తిపోతల పథకాల కింద మరో 36 వేల ఎకరాలు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 93 వేల ఎకరాలకు సాగునీరు రావాల్సి ఉంది.

- Advertisement -