ప్లేటు ఫిరాయించిన జేసీ…

92
JC Praises Chandrababu

జేసీ దివాకర్ రెడ్డి…తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. కర్నూల్ జిల్లాకు చెందిన జేసీ…..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ప్రజాప్రతినిధిగా సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన జేసీ….మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలో చేరి అనంతపురం నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత టీడీపీ కూడా జేసీకి మంచి ఇంపార్టెన్సే ఇచ్చింది. అయితే రాజకీయాల్లో తనదైన స్టైల్లో విమర్శలు చేసే జేసీ….టీడీపీ అధినేతపై కూడా అలాంటి సెటైర్లనే వేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. కానీ ఇవాళ కర్నూల్ జిల్లా మచ్చుమర్రి గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడిన జేసీ…చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు.

రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి చేయాలని పరితపిస్తుండటంతోనే టీడీపీలో చేరామని తెలిపారు. కూలం కూడు పెట్టదని…ఎందుకో రెడ్లంతా వైకాపాకే మద్దతిస్తున్నారని వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్,చంద్రబాబు ఏ కులమని రాయలసీమకు నీళ్లు ఇస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌కు బుద్దిలేదు కాబట్టే పట్టిసీమను వ్యతిరేకించాడని మండిపడ్డారు. ప్రజలంతా చంద్రబాబుకే మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

ఇదే జేసీ…..కొద్దిరోజుల క్రితం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని…రాష్ట్రంలో చంద్రబాబు.. అధికారులతో పాలన జరుపుతున్నాడని…అది మంచిది కాదన్నారు. పిలిస్తే వెంటనే రావడానికి చంద్రబాబు గాంధీ మహాత్ముడు కాదన్నారు. పయ్యావుల కేశవ్ లాంటి వారికే విలువలేకపోతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

చంద్రబాబు ఒక్కడి వల్లే టీడీపీ అధికారంలోకి రాలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను పట్టించుకోవటం మానేశాడని…ఎమ్మెల్యేలు కింది స్ధాయి వారిని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. చంద్రబాబు వల్ల ఆరుశాతం ఓట్లు వస్తే…మరో మూడు ఓట్లు ఎమ్మెల్యేల ద్వారా వస్తేనే గెలుస్తామన్నారు. చంద్రబాబు కష్టపడుతున్నారని… గెలిస్తే ఆయన వల్లనే గెలుస్తాం….లేదంటే ఇంటికి పోతామని సెటైర్ వేశారు.

దీనికి కొనసాగింపుగా ఇటీవలె తెలంగాణ అసెంబ్లీకి విచ్చేసిన జేసీ…సీఎల్పీ,టీడీఎల్పీ కార్యాలయాలను సందర్శించారు. రాష్ట్ర విభజనతో అనంతపురం, కర్నూల్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని…ఈ రెండు జిల్లాలు ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డ జిల్లాలని పరోక్షంగా బాబుపై విమర్శలు గుప్పించారు.