టీఎస్ అసెంబ్లీకి జేసీ…జానాకు చురక

185
JC Diwakar Reddy at Telangana Assembly
- Advertisement -

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇవాళ ఉదయం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. సీఎల్పీ,టీడీఎల్పీ కార్యాలయాలను సందర్శించిన జేసీ…కాంగ్రెస్ నేత జానారెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను మీరు సమర్ధవంతంగా నిర్వహించడం లేదని….ప్రభుత్వంపై మీ పోరాటం సరిగా లేదని జానాతో అన్నారు. కర్నూల్,అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని విభజన సమయంలో చెప్పానని…అలా చేసి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదని వ్యాఖ్యానించారు.

 ఆర్ధికమంత్రి ఈటెలతో కూడా జేసీ సరదాగా మాటలు కలిపారు. రాష్ట్ర విభజనతో అనంతపురం, కర్నూల్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని…మమ్మల్ని అడవుల పాలు చేశారని అన్నారు. ఈ రెండు జిల్లాలు ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాలపై ఆధారపడ్డ జిల్లాలని…మేము తెలంగాణలో ఉండి ఉంటే మేం ఈ రాష్ట్రానికి చెందిన వాళ్లం కాదా…నీళ్లు ఇవ్వరా అని అడిగేవాళ్లమని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే, మీకు శ్రీశైలం నుంచి నీరు వస్తుంది కదా అని ఈటెల సమాధానం ఇచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న జేసీ…తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న జేసీ…జానాతో ఉన్న పాతపరిచయాల నేపథ్యంలో భేటీ అయినట్లు తెలుస్తోంది.

ఇక నిన్న టీడీపీ వర్క్‌ షాప్‌ జరుగుతుండానే ఏపీ సీఎం చంద్రబాబుపై జేసీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని ..రాష్ట్రంలో చంద్రబాబు.. అధికారులతో పాలన జరుపుతున్నాడని…అది మంచిది కాదని సూచించారు. పిలిస్తే వెంటనే రావడానికి చంద్రబాబు గాంధీ మహాత్ముడు కాదని..చంద్రబాబు ఎమ్మెల్యేలను పట్టించుకోవటం మానేశాడని ఆరోపించారు. చంద్రబాబు కష్టపడుతున్నారని… గెలిస్తే ఆయన వల్లనే గెలుస్తాం….లేదంటే ఇంటికి పోతామన్నారు.

- Advertisement -