తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతూ అసువులు బాసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత వదిలి వెళ్లిన సంపద ప్రస్తుతం ఎవరికి దక్కుతుందో అంటే అందరికీ ప్రశ్నార్థకమే. ఎవరిపైనా ఆధారపడని అమ్మ ఇటు రాజకీయ వారసులను, అటు ఆస్తిపై హక్కులను ఎవరికీ కట్టబెట్టనున్నారో ఎన్నడూ వెల్లడించలేదు. జయలలిత మరణంతో పార్టీ పగ్గాలు ఆమె నెచ్చిలి శశికళకు, ముఖ్యమంత్రి పదవి జయమ్మ విధేయుడు పన్నీర్ సెల్వంకు అప్పజెప్పుతూ పార్టీ శ్రేణులు నిర్ణయించారు. కానీ ఆమె ఆస్తులకు ఎవరు వారసురాల్లో ఇంకా వెల్లడికాలేదు. ఆర్కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక సమయంలో అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత పోటీ చేసేటప్పుడు 2015 జూన్ వరకు తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు ఆమెనే ప్రకటించారు.
నంబర్ 81, వేదా నిలయం, పోయెస్ గార్డెన్.. తమిళనాట రాజకీయానికి ఈ చిరునామా బలమైన అడ్డా. దాదాపు పాతికేళ్లు తమిళనాడులో అసలైన రాజకీయాలు ఈ చోటు నుంచే ప్రారంభమయ్యాయి. ఎప్పుడో తమిళనాడు ముఖ్యమత్రి జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఈ ఆస్తిని తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు జయ ఉపయోగించుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల అంచనా ప్రకారం ఈ ఎస్టేట్ విలువ ఇప్పుడు దాదాపు రూ.90కోట్లపై మాట.
పోయేస్ గార్డెన్,,వేద విలాస్ తో పాటు జయలలితకు సంబంధించిన స్ధిరాస్తులు ఇతర ప్రదేశాల్లో కూడా ఉన్నాయి. ఆమెకు ఉన్న ఇతర ఆస్తులు..తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలు, తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రాపర్టీని ఆమె తన తల్లి సంధ్యతో కలిసి 1968లో కొనుగోలు చేశారు. కాంచీపురం చెయూర్లోని ప్రాపర్టీని 1981లో కొనుగోలు చేశారు. జయలలితకు మొత్తం నాలుగు వాణిజ్య భవనాలున్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్‌లో ఉంది. రిపోర్టుల ప్రకారం దీనిలో ఒక ప్రాపర్టీ తను దత్తత తీసుకున్న శశికళ అన్న కుమారుడు వీఎన్ సుధాకర్‌కు చెందుతున్నట్టు తెలుస్తోంది. అలాగే జయలలితకు సొంతంగా తొమ్మిది వాహనాలు ఉన్నాయి. వీటి ఖరీదు రూ.42,25,000.
జయలలితకు అడంబర వస్తువులపైన మొదటి నుంచి కాస్త ప్రీతి ఎక్కువనే ఉండేది. అమ్మ దగ్గర 21280.300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్టు సీఎంగా ఉన్నప్పుడు ఆమెనే ఓ సారి ప్రకటించారు. అక్రమాస్తుల కేసుల్లో ఇవి ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయని, ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి ఉన్నట్టు పేర్కొన్నారు.
అక్రమాస్తుల కేసుల ఆరోపణల నేపథ్యంలో ఆమెకు పలు కంపెనీల్లో ఉన్న డిపాజిట్లను, షేర్లను పోలీసులు సీజ్ చేశారు. 2004 స్పెషల్ సీ.సీ 208 ప్రకారం వాటిని కోర్టు కస్టడీకి తీసుకుంది. పార్టనర్‌గా ఆమె ఐదు సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి విలువ రూ.27.44 కోట్లు. ఆ ఐదు సంస్థలు శ్రీ జయ పబ్లికేషన్స్, శశి ఎంటర్ప్రైజెస్, కోదండ ఎస్టేట్, రాయల్ వ్యాలీ ఫ్లోరిటెక్ ఎక్స్‌పోర్ట్స్, గ్రీన్ టీ ఎస్టేట్.
దీంతో ఇప్పుడు ఆ ఆస్తులు ఎవరికీ కేటాయిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. ప్రధానంగా పరిశీలించినప్పుడు జయ స్నేహితురాలు శశికళ నటరాజన్‌కు వేదా నిలయంలో శాశ్వతంగా ఉండే హక్కు వస్తుందా లేక ఆమె మేనకోడలు దీపా జయకుమార్, సోదరుడు దీపక్ లకు ఈ అవకాశం వస్తుందా అని ఒక ప్రశ్న తలెత్తుతుండగా.. జయ రాజకీయ గురువు ఎంజీ రాంచంద్రన్‌కు రామాపురం, చెన్నైలో ఉన్న ఇళ్ల మాదిరిగానే చట్టపరమైన వివాదాల్లో చిక్కి ఇప్పటికీ ఎవరికీ దక్కనట్లుగానే అలాగే ఉండిపోతుందా అనేది మరో ప్రశ్న. జయలలిత అంతిమ సంస్కారాలను పూర్తి చేసిన శశికళ అనంతరం నేరుగా వేద నిలయానికి వెళ్లారు. వాస్తవానికి పోయెస్ గార్డెన్‌ను జయలలిత, ఆమె తల్లి సంధ్య కలిసి కొనుగోలు చేసినందున తమ నాయనమ్మ ఆస్తిలో వాటా వస్తుందని జయ మేనళ్లుడు, మేనకోడలు అడిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.