తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా జనసేన రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీతో పాటు తెలంగాణలో పోటీచేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏపీలో బీఏస్పీ,సీపీఐ,సీపీఎంతో జట్టుకట్టిన జనసేనాని పవన్ తెలంగాణలోనూ ఈ పార్టీలతో కలిసి నడిచేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మల్కాజ్‌గిరి నుండి వ్యాపారవేత్త మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుండి నేమూరి శంకర్ గౌడ్‌ను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది జనసేన.
ఇక తెలంగాణలో జనసేన పోటీ చేయడం వెనుక ఓ లెక్కుంది. బీఎస్పీతో పొత్తు,వామపక్షాలతో కలిసి నడవడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో కలిసివస్తుందని జనసేనాని భావిస్తున్నారు. ఇక తెలంగాణలో 2014 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఇద్దరు ఎమ్మెల్యేలు .ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పోటీచేసి ఒక్కసీటు గెలవకపోయినా తన ఓటు బ్యాంకును కాపాడుకోగలిగింది. దీంతో బీఎస్పీతో కలసి తన సత్తా పరీక్షించుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతోపాటు సీపీఎం,సీపీఐతో కూడా ఏపీలో అవగాహన ఉంది. అది కూడా తమ పార్టీకి కలసివస్తుందని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అన్నిస్ధానాల్లో కాకపోయిన కొన్నిస్ధానాల్లోనైనా పోటీచేయడం ద్వారా తాను కేవలం ఏపీకే పరిమితం కాలేదని తెలంగాణలోను జనసేన పార్టీ ఉంటుందనే సంకేతాలను ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. అందుకే జనసేన పోటీచేయని చోట బీఎస్పీ,వామపక్షాలకు మద్దతివ్వడం ద్వారా పార్టీని కాపాడుకోవాలని భావిస్తున్నారు. అయితే తెలంగాణలో పవన్ ప్రచారం చేస్తారనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు.
అయితే జనసేన, బీఎస్పీ పొత్తుపై సెటైర్లు వేశారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. పవన్-మాయావతిది పొలిటికల్ స్టంట్ అని..వారి ప్రభావం తెలంగాణలో నామమాత్రమేనని స్పష్టం చేశారు. మొత్తంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీచేయనున్న పవన్ ఏ మేరకు ప్రభావం చూపుతారో వేచిచూడాలి.