‘జాగ్వార్’ మూవీ రివ్యూ

309
- Advertisement -

మాజీ ప్రధానమంత్రి హెచ్ డి దేవెగౌడ మనవడు గా , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడి గా సినీరంగ ప్రవేశం చేసిన నిఖిల్ కుమార్ గౌడ బాహుబలి కథకుడు అయిన విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ తో రాజమౌళి శిష్యుడు మహదేవ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ”జాగ్వార్ ”. జగపతి బాబు.. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించడంతో పాటు, తమన్నా ఓ ప్రత్యేక గీతంలో కనిపించడంతో ఈ సినిమాపై బాగా హైప్ క్రియేటైంది. దక్షిణాదిలో ఆరంగ్రేటంలోనే ఓ హీరోతో 75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా జాగ్వార్‌. తెలుగు,కన్నడలో ఒకేసారి విడుదలైన జాగ్వార్‌ నిఖిల్‌కి కలిసివచ్చిందా.. నిఖిల్‌ ఎలా నటించాడు.?జాగ్వార్‌తో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడో చూద్దాం..

కథ :

మెడికల్ విద్యార్థి అయిన కృష్ణ (నిఖిల్ కుమార్) తన చుట్టూ ఉండే అందరిలానే చదువుకుంటూ, సరదాగా కాలం వెళ్ళదీస్తుంటాడు. కాలేజీలో తన సీనియర్ ఆర్య(ఆదర్శ బాలకృష్ణ)తో ఎప్పుడు గొడవపడుతుంటాడు.ఈ క్రమంలో ఆర్య చెల్లెలు ప్రియా(దీప్తి సతి)తో ప్రేమలో పడతాడు. మరోవైపు కృష్ణ, రాత్రి వేళల్లో ఓ టీవీ ఛాన‌ల్‍నే హ్యాక్ చేసి, మాస్క్ వేసుకొని పలు హత్యలు చేస్తూ అవి లైవ్‌లో వచ్చేలా చేస్తూంటాడు. ఈ లైవ్ హత్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఆ కేసును డీల్ చేయడానికి ఓ సీబీఐ ఆఫీసర్‌ (జగపతి బాబు)ను కూడా నియమిస్తుంది. కట్ చేస్తే కృష్ణ వారిని ఎందుకు చంపుతాడు? అల్లరిగా తిరిగే కృష్ణ జీవితంలో చీకటి కోణం ఏంటి? చివరకు సీబీఐ జాగ్వార్‌ను పట్టుకుంటుందా?లేదా అన్నదే మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నిఖిల్,సెకండాఫ్,ఎంచుకున్న లైన్. కొత్తవాడైనప్పటికి నిఖిల్ కుమార్ ఎక్కడా ఆ బెరుకు లేకుండా నటించి మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాల్లో అద్భుతంగా నటించాడు.అలాగే డ్యాన్స్ లలో కూడా . లవ్ సీన్స్ లో కూడా మెప్పించాడు . మొదటి పది నిమిషాల ఛేజింగ్ ఎపిసోడ్, మధ్యలో కార్ ఎపిసోడ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు బాగున్నాయి.హీరోయిన్ దీప్తి కి నటన కంటే అందాలను ఆరబోయడంలోనే ఎక్కువ మార్కులు పడతాయి.

jaguar

జగపతి ఓ స్టైలిష్ సీబీఐ ఆఫీసర్‌గా బాగా చేశాడు. ముఖ్యంగా ఆయన పాత్రను పరిచయం చేసిన విధానం బాగుంది. ముందే చెప్పినట్లు రావు రమేష్ తన పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు. రమ్యకృష్ణ క్లైమాక్స్‌లో ఇచ్చిన అప్పీయరన్స్ ఆ సన్నివేశాలకు బలాన్నిచ్చింది.ఆదిత్య మీనన్ , సంపత్ లు విలనిజాన్ని పండించారు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

అసలు కథను పక్కనబెడితే ఈ స్క్రీన్‌ప్లే ఫార్మాట్ తెలుగులో ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. సినిమాకు రెగ్యులర్ కథ,కథనం మ్యూజిక్ ఓవర్‌ యాక్షన్‌ సీక్వెల్స్ పెద్ద మైనస్. పాటలు, లవ్‌ట్రాక్ సాగదీసి బోర్ కొట్టించాయి. సెకండాఫ్‌లో అనవసరంగా ఇరికించిన కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అసలు కథలోని ఎమోషన్‌ను బలంగా చెప్పే సన్నివేశాలను మినహాయిస్తే మిగతా సినిమా అంతా అలా అలా సాగిపోయింది.

సాంకేతిక విభాగం :

విజయేంద్ర ప్రసాద్ ఎంచుకున్న లైన్ బాగానే ఉంది కానీ దాన్ని పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూట్ చేయలేక పోయారు.కథకు అనవసరమైన ఎపిసోడ్స్‌ను జతచేస్తూ పోయి మంచి కమర్షియల్ సినిమా కాగల కథను అలా వదిలేశారు. మేకింగ్ పరంగానూ మహదేవ్ చూపిన ప్రతిభ పెద్దగా ఏమీ కనిపించలేదు. ఈ చిత్రానికి హైలెట్ ఛాయాగ్రహణం. మనోజ్ పరమహంస తన మనోనేత్రం తో ఈ సినిమాని మరింత అందంగా చూపించాడు. భారీ విజువల్స్ తో ప్రేక్షకులను స్పెల్ బౌండ్ చేశాడు మనోజ్ పరమహంస . తమన్ అందించిన సంగీతం యావరేజ్ గానే ఉంది.నిర్మాణ విలువలు బాగున్నాయి. భారీ బడ్జెట్ అన్నది ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.

తీర్పు :

ట్రైలర్‌తో, ప్రమోషన్స్‌తో మంచి ఆసక్తినే రేకెత్తించిన జాగ్వార్.. తెలుగు కమర్షియల్ సినిమాల పరంపరలో ఎప్పుడూ వస్తూ పోతూండే వాటిల్లో ఒక సినిమా. కథలోని ఎమోషన్ బాగుండడం, కొన్ని ఛేజింగ్ సన్నివేశాలు బాగా ఆకట్టుకోవడం లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమా మిగతా అన్నిచోట్లా రొటీన్ అయిపోవడం నిరాశపరిచే అంశం. సగటు ప్రేక్షకుడు కోరుకునే వినోదం తో పాటు ఓ చిన్న కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉన్న ఈ జాగ్వార్ అన్ని తరగతుల ప్రేక్షకులకు నచ్చుతుందా అంటే కొంచెం డౌటే.

విడుదల తేదీ : అక్టోబర్ 06, 2016
రేటింగ్ : 2.5/5
నటీనటులు : నిఖిల్ కుమార్, దీప్తి సతి
సంగీతం : ఎస్.ఎస్.థమన్
నిర్మాత : అనితా కుమారస్వామి
దర్శకత్వం : ఏ. మహదేవ్

- Advertisement -