రామనామ స్మరణతో సకల శుభాలు, విజయం, ఆరోగ్యం, ఐశ్వర్యం సమకూరుతాయని కడపకు చెందిన జగన్నాథ శాస్త్రి పేర్కొన్నారు. ఒంటిమిట్ట కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ శాస్త్రి “అయోధ్యకాండ” పై మాట్లాడుతూ, శ్రీమద్రామాయణ పారాయణం ఒక జ్ఞానయజ్ఞమన్నారు. వేదస్వరూపమైన రామాయణ పారాయణం ద్వారా భక్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్తశుద్ధి కలుగుతాయని, వీటి ద్వారా మోక్షం లభిస్తుందని చెప్పారు.
సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి అరణ్యంలో సంచరించేటప్పుడు పితృవాక్యా పరిపాలన, సీతమ్మవారు పతివ్రత ధర్మం, లక్ష్మణ స్వామివారు సోదర ధర్మం వంటి అనేక ధర్మాలను తెలియజేస్తుంది. కావున అయోధ్యకాండను ధర్మకాండ అని అంటారన్నారు. రామాయణంలోని అయోధ్యకాండ పారాయణం చేసినా, విన్నా ప్రతి ఒక్కరికి మోక్ష, ధన ప్రాప్తి కలుగుతుందని చెప్పారు. ఇందులో శ్రీరామచంద్రమూర్తి అందరికి ధనం, ధాన్యం, గోవులు, ఏనుగులు తదితర వాటిని దానం చేసినట్లు తెలిపారు.
Also Read:BRS రజతోత్సవం..3వేల బస్సులు ఇవ్వండి
శ్రీ రామ్ చక్రధర్ “సుందర కాండ” అనే అంశంపై ప్రసంగిస్తూ, సుందరకాండలో హనుమంతుని ప్రవేశం నుండి యుద్ధ కాండ చివరి వరకు అష్టసిద్ధుల వలన ఆయన లోకానికి అద్భుతాలను చూపించి రామాయణాన్ని ఒక సుందర ఇతి హసంగా మలచడానికి కారణం అయ్యారన్నారు.
ఆచార్య రాంప్రసాద్ రెడ్డి “బాలకాండ” అనే అంశంపై మాట్లాడుతూ, శ్రీరాముడి బాల్య విశేషాలు, రాక్షస సంహారం, శివధనస్సు విరిచి సీతాదేవిని కల్యాణం చేసుకోవడం తదితర అంశాలు ఉన్నాయన్నారు. భక్తులు ఈ శ్లోకాలను పఠించిన, శ్రవణం చేసినా సంపూర్ణ ఆరోగ్యం శిద్ధిస్తుందన్నారు.
అనంతరం ఆచార్య మల్లికార్జున రెడ్డి “కిష్కిందకాండ” శ్రీమతి లక్ష్మి “అరణ్యకాండ” శ్రీ మధుసూదన్ “యుద్ధకాండ”మాడుగుల శివ శ్రీ శర్మ”ఉత్తరాఖండ”లపై ప్రసంగించారు.