‘బాహుబలి’ సినిమా రెండవ భాగం బాహుబలి: ది కన్‌క్లూజన్’ విజువల్ వండర్ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టిక్కెట్లు ఎప్పుడెప్పుడు దొరుకుతాయా.. అంటూ భాషలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా బాహుబలి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు కొన్ని గంటల సమయమే ఉంది. విడుదలకు సమయం దగ్గర పడేకొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది బాహుబలి టీం.
ఇదిలా ఉంటే.. బాహుబలి2 అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు ముందే ఈ సినిమా మరో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో వెల్లడించిన విషయం సగటు సినీ ప్రేక్షకుడు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నాడో చెప్పేసింది. బుక్‌మై షోలో బాహుబలి2 టికెట్లు అందుబాటులో ఉంచిన 24 గంటల్లోనే పది లక్షల టికెట్లు అమ్ముడుపోయాయని సదరు వెబ్‌సైట్ యాజమాన్యం వెల్లడించింది.
టికెట్స్ బుకింగ్‌లో అమీర్ ఖాన్ దంగల్ సినిమా రికార్డ్‌ను బాహుబలి2 దాటేసిందని బుక్‌మై షో తెలిపింది. అంతేకాకుండా అమీర్ ఖాన్ కే షాక్ ఇచ్చేలా చేసింది. దంగల్ సినిమా రికార్డ్‌ను బాహుబలి2 దాటేసిందని బుక్‌మై షో తెలిపింది. దక్షిణాదిప్రాంతాల్లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయాయని, ఒక్క రోజుకే ఇంత భారీ రెస్పాన్స్ రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపింది. మల్టీఫ్లెక్స్‌ల్లో ఇప్పటికే దాదాపు తొలి వారం టిక్కెట్లు అయిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఒక్క ప్రశ్నకు సమాధానం కోసమే సగం మంది ప్రేక్షకులు ఈ సినిమా చూడాలని భావిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదేమో. ఏదేమైనా ఒక తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఇంత గుర్తింపు రావడం ఇదే తొలిసారి. పైగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోవని తెలుస్తోంది.