Kejriwal:కేజ్రీవాల్ ‘ఛలో తీహార్’?

14
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. గత నెల 21న కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకోగా.. అరెస్టును సవాల్ చేస్తూ ఇందులో రాజకీయ కోణం ఉందని, తనను అక్రమంగా అరెస్ట్ చేశారని గత నెల 23న కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే కేజ్రీవాల్ కు హైకోర్టు షాక్ ఇస్తూ ఈడీ అరెస్టును ఆపలేమంటూ స్పష్టం చేసింది. దీంతో అప్పటి నుంచి ఈడీ కస్టడీలోనే ఉన్న కేజ్రీవాల్.. నేటితో ఆయన కస్టడీ పూర్తవుతుంది. దాంతో రౌజ్ అవెన్యూ కోర్టులో ఆయనను ప్రవేశ పెట్టి జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు టాక్. అయితే జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తుందా లేదా అనేది సందేహమే..

ఒకవేళ అనుమతి ఇస్తే కేజ్రీవాల్ కు గట్టి దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఆయనను తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. అదే జరిగితే సార్వత్రిక ఎన్నికల ముందు ఈ పరిణామం ఆం ఆద్మీ పార్టీని తీవ్రంగా దెబ్బ తీసే అవకాశం ఉంది. ఇకపోతే కేజ్రీవాల్ అరెస్టును సానుభూతిగా మార్చుకునేందుకు ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అందుకోసం నిరసన చేపడుతూ ఇటీవల రామ్ లీలా మైదానంలో ఇండియా కూటమి ఓ భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆ సభ అనుకున్న స్థాయిలో ఇంపాక్ట్ చూపలేకపోయింది. దాంతో అటు ఇండియా కూటమి, ఇటు ఆం ఆద్మీ పార్టీ రెండు కూడా కేజ్రీవాల్ అరెస్టుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే కూటమిని నిర్మూలించేందుకే మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయించిందనే వాదన కూడా అడపా దడపా వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి కేజ్రీవాల్ అరెస్టు అంశం దేశ రాజకీయాలను ఒక్కసారిగా మలుపు తిప్పిందనే చెప్పవచ్చు.

Also Read:Revanth Reddy:రేవంత్ రెడ్డిపై గుస్సా!

- Advertisement -