మణిపూర్ కు చెందిన పౌరహక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిలా పెళ్లి చేసుకుంది. పదహారేళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఆమె గత ఏడాదే దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు.. ఇప్పుడు బ్రిటన్ కు చెందిన తన స్నేహితుడిని వివాహమాడారు.
తమిళనాడులోని కొడైకెనాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో షర్మిల వివాహం గురువారం నిరాడంబరంగా జరిగింది. ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం షర్మిల, కౌటినో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి ఇరువురి తరఫున బంధువులు గానీ, మిత్రులు గానీ ఎవరూ హాజరుకాలేదు. వాస్తవానికి ఈ పెళ్లికి శుభలేఖలు కొట్టించలేదు. కనీసం ఎవరినీ ఆహ్వానించలేదు.
పెళ్లి తరవాత తాను కొడైకెనాల్‌లోనే స్థిరపడనున్నట్లు షర్మిల చెప్పారు. ప్రశాంతత కోసం తాను అనేక ప్రాంతాలు వెతికానని, కొడైకెనాల్లో తన అన్వేషణ ముగిసిందన్నారు. ఎప్పటిలాగే దేశంలో శాంతి, న్యాయం కోసం సాయుధ భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా పోరాడతానని స్పష్టం చేశారు. వచ్చే నెలలో భువనేశ్వర్‌లో జరగనున్న దక్షిణాసియా యువజన సమ్మిట్ 2017లో పాల్గొంటానని చెప్పారు. ఈ సమ్మిట్‌లో సాయుధ భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం, మణిపూర్‌పై దాని ప్రభావంపై ఐదు నిమిషాల పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.