ఐపీఎల్ 13లో భాగంగా తొలి మ్యాచ్‌లో చెన్నై గ్రాండ్ విక్టరీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే చేధించింది.
ఆరంభంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. షేన్ వాట్సన్‌ను తొలి ఓవర్లోనే బౌల్ట్ వెనక్కిపంపగా తర్వాతి ఓవర్లో జేమ్స్ పాటిసన్ మురళీ విజయ్‌ను ఎల్బీగా పెవిలియన్‌కు పంపాడు. తర్వాత ముంబై బౌలర్లను రాయుడు, డుప్లెసిస్ జోడి అద్భుతంగా ఎదుర్కొంది. ముఖ్యంగా రాయుడు.. దూకుడుగా ఫోర్లు, సిక్సులు బాదుతూ ఈ సీజన్లో తొలి అర్ధ సెంచరీ బాదాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయుడు 41 బంతుల్లో 71 పరుగులు చేయగా డుప్లూసిస్ 58 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు.
అంతకముందు టాస్ గెలిచిన ధోని ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరంభం నుండే డికాక్, రోహిత్ జోడి అద్భుతంగా ఆడింది. చెన్నై బౌలర్లపై అటాక్ దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే వెంటవెంటనే వీరిద్దరు వెనుదిరగడంతో స్కోరు బోర్డు కాసింత నెమ్మదించింది. 14 ఓవర్లలో ముంబై జట్టు 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. అయితే తర్వాత వెంటవెంటనే వికెట్లు కొల్పోవడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది.
దీంతో నిర్ణీత ఓవర్లలో 162 పరుగులు చేసింది.