న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం..

511
india
- Advertisement -

న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌ జోరు కొనసాగిస్తోంది. నేడు ఆక్లాండ్‌లో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆతిథ్య న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కివీస్ ఇచ్చిన 133 పరుగుల లక్ష్యాన్ని మరో 2.3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ న్యూజిలాండ్‌పై 2-0 ఆధిక్యంలో నిలిచింది.

ఓపెనర్ రోహిత్ శర్మ (8) విఫలమైనా సూపర్ ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సులు) సమయోచితంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాహుల్‌కు శ్రేయాస్ అయ్యర్ కూడా తోడవడంతో న్యూజిలాండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. అయ్యర్ 33 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సులతో 44 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబే ఓ భారీ సిక్స్ తో మ్యాచ్‌ను ముగించాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ కీలక సమయాల్లో ముఖ్యమైన వికెట్లను కోల్పోయింది. దీంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కివీస్‌ కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో మార్టిన్‌ గప్తిల్‌ (20 బంతుల్లో 33 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్‌ సెయిఫర్ట్‌ (26 బంతుల్లో 33 పరుగులు, 1 ఫోర్‌, 2 సిక్సర్లు)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఇరు జట్ల మధ్య మూడో టి20 జనవరి 29న హామిల్టన్ లో ని సెడాన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.

- Advertisement -