పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్ల కుబేరులు నల్ల ధనాన్ని తెలుపు చేసుకొనేందుకు ఇతరుల ఖాతాలను వినియోగించుకోవడంపై ఆర్బీఐ దృష్టి సారించింది. ఇతరుల ఖాతాలో పెద్ద ఎత్తున నగదు జమ చేసే సమయంలో ఎవరి ఖాతాలో నగదు జమ చేస్తున్నారో ఆ ఖాతాదారు నుంచి ఆథరైజేషన్ లెటర్ తీసుకురావాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని బ్యాంకులను ఆదేశించింది ఆర్బీఐ. అంతే కాకుండా ఇకనుంచి ఇతరుల ఖాతాల్లో నగదు జమచేసే వారికి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని ఐటీశాఖ హెచ్చరించింది.
ఐటీశాఖ నిబంధనల ప్రకారం ఒక్కో ఖాతాలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ నగదు ఉంటే ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ఖాతాల్లో రూ.50 వేల వరకు జమచేసుకోవచ్చని పేర్కోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ నోట్లను మార్చుకునేందుకు నకిలీ బాబులు జన్‌ధన్ ఖాతాలను ఉపయోగించుకుంటున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఐటీ శాఖ ఈ హెచ్చరికలు జారీ చేసింది.
అయితే డిసెంబర్ 31 తరువాతే ఐటీశాఖ తమ పని ప్రారంభింస్తుందనుకున్నారు నల్లబాబులు. దీన్ని ఆసరాగా చేసుకొని ఈనెల 8వ తేదీ తర్వాత ఇతరుల బ్యాంకు ఖాతాల్లో అయిన నగదు జమ వివరాలను ఐటీ శాఖ రాబడుతోంది. కొన్ని ఖాతాల్లో అసాధారణ, అనుమానాస్పద రీతిలో పెద్దమొత్తంలో నగదు జమ అవుతున్నట్టు గుర్తించింది. ఈ విషయమై ఫిర్యాదులు అందుకున్న ఐటీశాఖ అక్రమార్కుల పనిపట్టేందుకు సిద్ధమైంది. ఇతరుల ఖాతాల్లో నగదు జమ చేసే వారికి ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. తాజా హెచ్చరికలతో నల్లకుబేరుల గుండెల్లో వణుకు మొదలైంది. ఉన్న నోట్లను మార్చుకోవడమెలాగో తెలియక అల్లాడిపోతున్నారు.