జనసేనను లైట్ తీసుకుంటే టీడీపీకి ముప్పే?

17
- Advertisement -

ఏపీలో జనసేన పార్టీని టీడీపీ తక్కువగా అంచనా వేస్తోందా ? అందుకే సీట్ల కేటాయింపులో జనసేన పార్టీని లైట్ తీసుకుంటుందా ? అంటే తాజా పరిణామాలు చూస్తే అవునని చెప్పక తప్పదు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని గద్దదించే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు జట్టు కట్టిన సంగతి విధితమే. అయితే పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల కేటాయింపులో మాత్రం ఇరు పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఇరు పార్టీలు రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో టీడీపీ జనసేన మధ్య అసలేం జరుగుతుందనే చర్చ మొదలైంది.

సాధారణంగా పొత్తులో ఉన్నప్పుడు ఇరు పార్టీలు కలిసి అభ్యర్థులను ప్రకటించాలి.. కానీ టీడీపీ జనసేన విషయంలో అలా జరగడం లేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు నామమాత్రమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫలితాలతో సంబంధం లేకుండా ఎలక్షన్ తర్వాత కూడా పొత్తు కొనసాగుతుందని ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ టీడీపీ మాత్రం జనసేన విషయంలో ఏం ఆలోచిస్తోందనేది ఆసక్తి రేపుతున్న ప్రశ్న. అయితే గతంలో జనసేన పార్టీకి అధిక ప్రాధాన్యమిస్తూ వచ్చిన టీడీపీ.. తెలంగాణ ఎన్నికల తర్వాత జనసేన పార్టీని లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు.

దీంతో ఏపీలో కూడా ఆపార్టీకి అదే రిజల్ట్ ఎదురైతే నష్టం తప్పదని టీడీపీ లోని ఓవర్గం భావిస్తుందట. అందుకే సీట్ల కేటాయింపులో ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లు వినికిడి. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో పరిస్థితులు వేరు. గత ఎన్నికల్లో జనసేన ఘోరంగా విఫలమైనప్పటికీ ఆ తర్వాత క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం జనసేన ప్రభావం కూడా గట్టిగానే ఉండే అవకాశం ఉందని సర్వేలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపులో జనసేన పార్టీని తక్కువగా అంచనా వేస్తే టీడీపీ కే ముప్పు అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఎన్నికల ముందు ఈ రెండు పార్టీలు ఎంతమేర సమన్వయంతో ముందుకెళతాయో చూడాలి.

Also Read:సైంధవ్ ఓటీటీ డేట్ ఫిక్స్..

- Advertisement -