జగమొండిగా పేరు తెచ్చుకున్న జయలలిత…తనకు ఎదురొచ్చిన వారిని ఎవ్వరిని వదల్లేదు. అంతకుఅంతా ప్రతీకారం తీర్చుకుంది. అది సొంతపార్టీ నేతలైనా….ప్రతిపక్ష పార్టీలైనా…మీడియా ఐనా జయ రూటే వేరు. తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రయోగించే బ్రహ్మాస్త్రం వాటిపై పరువునష్టం దావా వేయడం.
తాజాగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందంటూ పలు కధనాలు ప్రచురిస్తున్న మీడియాపై దాడికి ఉపక్రమించారు. ముందుగా ఇటువంటి వార్తను ప్రచారంలోకి తెచ్చిన రీడిఫ్.కామ్ పై ఆమె తరపున తమిళనాడు ప్రభుత్వం మంగళవారం చెన్నై హై కోర్టు లో క్రిమినల్ పరువునష్టం దావా వేసింది. “జయలలిత ఆరోగ్యం బాగాలేదని చెన్నై మీడియా కు తెలుసు. అయినా నోరుమెదపడం లేదు” అంటూ కధనాన్ని ప్రచురించింది. ఈ సమాచారాన్ని వాస్తవాలను నిర్ధారణ చేసుకోకుండా దురుద్ధేశంతో, ఆమె ప్రతిష్టను దిగజార్చడం కోసం ప్రచురించారని అంటూ దావాలో పేర్కొన్నారు. రచయత, ఎడిటర్, సీఈఓ లతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు. జయలలిత కు వెంటనే కాలేయం మార్పిడి జరగాలని, ఆమె కాలేయం పరిస్థితి ఏమీ బాగోలేదని, అందుకు చికిత్సకోసం ఆమె త్వరలో సింగపూర్ వేళ్ళనున్నరని ఆ వార్తాకధనంలో పేర్కొన్నారు.
ఆమె గతంలోనూ వ్యక్తులు, మీడియా సంస్థలపై ఇటువంటి కేసులను పెట్టారు. మొదటిగా 1991-1996 ల మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 146 పరువునష్టం కేసులు దాఖలు చేశారు. నక్కీరన్ పత్రిక సంపాదకుడు ఆర్.ఆర్. గోపాల్ ను పోటా చట్టం క్రింద అరెస్ట్ కుడా చేశారు. ఆమె రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూ పత్రికపై సుమారు 20 కేసులు దాఖలు చేశారు. మొదటిసారి కన్నా రెండో సారి ఆమె దాఖలు చేసిన కేసు ల సంఖ్య తక్కువగా ఉన్నా తనకు వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు ఆమె స్పందించే తీరులో మాత్రం పెద్దగా మార్పు లేదు.