పోయెస్ గార్డెన్‌లా మారిన అపోలో..

169
jayalalithaa
- Advertisement -

అదేంటీ… పోయెస్ గార్డెన్ అంటే అన్నాడీఎంకే అధినేత్రి, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ముచ్చ‌ట‌ప‌డి కట్టించుకున్న భ‌వ‌నం క‌దా అనేగా మీ అనుమానం. మీ అనుమానంలో ఎలాంటి పొర‌పాటు లేదు. ఎందుకంటే త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగానే కాకుండా, ఆ రాష్ట్ర విప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలోనే జ‌య‌ల‌లిత నివ‌సించే బంగ‌ళా పేరు పోయెస్ గార్డెనే. ఇందులో ఏ ఒక్క‌రికి అనుమానం అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం కూడా జ‌య‌ల‌లిత నివాసం పేరు పోయెస్ గార్డెనే. ఆ ఇంటి నుంచి ఆమె ఎక్క‌డికీ మార‌లేదు. భ‌విష్య‌త్తులో మారే అవ‌కాశాలు అంత‌క‌న్నా లేవ‌నే చెప్పాలి. .

దాదాపు రెండు నెల‌ల క్రితం (న‌వంబ‌రు 22న‌) అర్ధ‌రాత్రి తీవ్ర జ్వ‌రం, డీహైడ్రేష‌న్ కార‌ణంగా స్పృహ కోల్పోయిన స్థితిలో జ‌య‌ల‌లిత… త‌న ఇంటికి స‌మీపంలోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిందని, ఆమె ఎప్పుడైనా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా అపోలో యాజమాన్యం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జయ క్షేమంగా తిరిగి వస్తున్నారంటూ ప్రజలంతా ఆనందించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం తమ ఆరాధ్య దేవతైన జయ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారనే వార్తలు రాష్ట్ర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తమ ప్రియతమ నేత కోలుకోవాలని ప్రజలు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు చేశారు.  అపోలో ఆస్పత్రికి  ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులతో సహా జయ అభిమానులు పెద్ద సంఖ్యలో అపోలోకు తరలివచ్చారు. దీంతో అపోలో హాస్పిటల్ కాస్త….పోయెస్ గార్డెన్ లా మారింది.

() సెప్టెంబర్‌ 22న జ్వరం, డీహ్రైడ్రేషన్‌ సమస్యలతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు.
() సెప్టెంబర్‌ 24న జయలలిత ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు వెల్లడించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. జయ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
() సెప్టెంబర్‌ 25న చికిత్స కోసం జయలలితను విదేశాలకు తరలిస్తున్నారనే వదంతులు వ్యాపించాయి. అయితే ఈ వదంతుల్ని అపోలో ఆస్పత్రి వర్గాలు ఖండించాయి.
() సెప్టెంబర్‌ 29న చికిత్సకు జయ స్పందిస్తున్నారని అపోలో వైద్యులు ప్రకటించారు. మరికొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఆమె ఉండాలని సూచించారు.
() అక్టోబర్‌ 1న జయలలిత ఆరోగ్యంపై వస్తోన్న వదంతుల్ని అన్నాడీఎంకే వర్గాలు, ఆస్పత్రి యాజమాన్యం ఖండించాయి. ఆమె ఆస్పత్రి నుంచే అధికారిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ప్రకటించాయి.
()అక్టోబర్‌ 2న జయలలితకు యాంటీబయోటిక్స్‌తో చికిత్స చేస్తున్నామని తెలిపారు. లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేలే ఆధ్వర్యంలో వైద్య చికిత్సలు అందించారు.
() అక్టోబర్‌ 6న ఎయిమ్స్‌ నుంచి ప్రత్యేక వైద్యబృందం చెన్నైకి చేరుకుంది.
() అక్టోబర్‌ 7న వెంటిలేటర్‌పై ఉన్నట్లు ప్రకటన
()అక్టోబర్‌ 21న జయలలిత కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.
() నవంబర్‌ 3న జయ పూర్తిగా కోలుకున్నారనీ, తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటున్నారని వెల్లడించారు.
()నవంబర్‌ 13న తనకు పునర్జన్మ లభించిందని ఆమె లేఖపై సంతకం చేశారు. అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వేచి ఉన్నట్లు వెల్లడించారు.
()నవంబర్‌ 19న అత్యవసర చికిత్సా విభాగం నుంచి ప్రైవేటు గదికి ఆమెను తరలించారు. వెంటిలేటర్‌ లేకుండా ఆమె శ్వాస తీసుకుంటున్నారని అపోలో వెల్లడించింది.
()నవంబర్‌ 25న ఆమె స్పీకర్‌ సాయంతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
()జయ పూర్తిగా కోలుకున్నారనీ, ఆస్పత్రి నుంచి ఎప్పుడైనా డిశ్చార్జి కావచ్చని అన్నాడీఎంకే ప్రకటించిన రోజుల వ్యవధిలోనే మళ్లీ పరిస్థితి విషమించింది.
()డిసెంబర్‌ 4న సాయంత్రం 6గంటల సమయంలో జయకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను అత్యవసర చికిత్సా విభాగానికి తరలించడంతో కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
()డిసెంబర్‌ 5న మధ్యాహ్నం 12.30గంటలకు అపోలో వైద్యులు జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ప్రకటించారు. ఆమె ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.సరిహద్దు రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
()జయలలిత ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు లండన్‌ వైద్యనిపుణుడు రిచర్డ్‌ బేలే వెల్లడించారు. ప్రపంచంలోనే అధునాతన వైద్యచికిత్సలు అందించినప్పటికీ ఆమెకు గుండెపోటు రావడం దురదృష్టకరమన్నారు. అభిమానుల ప్రార్థనలే జయను కాపాడాలని ఆయన అన్నారు.

- Advertisement -