మధ్యప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చారిత్రాత్మక షాహీ మసీదు కాంప్లెక్స్ వద్ద రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం మసీదులో కొంత భాగాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టడంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య భారీ ఘర్షణ చోటుచేసుకుంది.
ఉజ్జయినిలోని కంఠాల్ నుండి గోపాల్ మందిర్ మార్గంలో ఉన్న షాహీ మసీదు ప్రాంతానికి అర్ధరాత్రి నుంచే ముస్లిం సంఘాల ప్రతినిధులు, స్థానికులు భారీగా చేరుకుని ధర్నా చేపట్టారు. మసీదు తొలగింపు చర్యలను అడ్డుకునేందుకు వందలాది మంది ఆందోళనకారులు మసీదు వద్ద బైఠాయించారు.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) బలగాలను మోహరించి, బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మసీదు వైపు వెళ్లేందుకు యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. కొంతమంది ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు (టియర్ గ్యాస్) ప్రయోగించారు.2028లో ఉజ్జయినిలో జరగనున్న ప్రతిష్టాత్మక ‘సింహస్థ కుంభమేళా’ (Simhastha 2028) ఏర్పాట్లు మరియు నగరంలో నిత్యం పెరిగిపోతున్న ట్రాఫిక్ నియంత్రణ కోసం 15 మీటర్ల మేర రోడ్డు విస్తరణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
రోడ్డు విస్తరణలో భాగంగా మసీదు కొంత భాగం తొలగింపుపై నోటీసులను సవాలు చేస్తూ మసీదు కమిటీ వేసిన పిటిషన్లను సెప్టెంబర్ 9న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ కొట్టివేసింది.మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటోందని, కుంభమేళా వంటి బృహత్తర కార్యక్రమాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రోడ్డు విస్తరణ అనివార్యమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మార్గంలో ఉన్న ఇతర మతపరమైన నిర్మాణాలను కూడా విస్తరణలో భాగంగా ఇప్పటికే తొలగించామని అధికారులు కోర్టుకు తెలిపారు.
Also Read:పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
మసీదు కొంతభాగాన్ని తొలగించే చర్యలను నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తుండటంతో ఉజ్జయిని పాత నగర ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు.

