తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎప్పుడో రద్దు చేసిన 1922 నాటి బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రయోగిస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ నివాసం వద్ద పోలీసులు ప్రవర్తించిన తీరుపై మన్నె క్రిశాంక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏకంగా 50 మంది పోలీసులు వచ్చి నా ఇంటి తాళాలు పగలగొట్టి, ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె తీవ్ర భయాందోళనకు గురై కన్నీళ్లు పెట్టుకుందని, చివరికి ఆమెను స్కూల్ పరీక్ష రాయడానికి కూడా వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.
పార్లమెంట్ ఇప్పటికే రద్దు చేసిన ‘పోలీస్ (ఇన్సైట్‌మెంట్ టూ డిసఫెక్షన్) యాక్ట్, 1922’ అనే బ్రిటిష్ కాలం నాటి రద్దయిన చట్టం కింద నాపై కేసు నమోదు చేశారు. పార్లమెంటే చెల్లదని చెప్పిన చట్టాలను ఒక పౌరుడిపై రుద్దడం అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (శాంతిభద్రతలు) ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాయో స్పష్టమవుతోంది. ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం.. సొంత మంత్రి అక్రమాలపై ఎందుకు నోరు విప్పడం లేదని క్రిశాంక్ ప్రశ్నించారు.
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ (ED) దాడులు జరిగి రెండేళ్లు గడుస్తున్నా.. ఆయనపై ఉన్న రూ. 650 కోట్ల కుంభకోణం ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.సొంత మంత్రిపై ఈడీ సోదాల్లో ఏం దొరికింది? ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని, ముందు దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు.
Also Read:పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని, ఈ రేవంత్ సర్కార్ నిరంకుశ వైఖరిపై న్యాయస్థానాల్లోనూ, ప్రజాక్షేత్రంలోనూ నిలదీస్తామని క్రిశాంక్ తేల్చిచెప్పారు.

